Israel: అల్‌-షిఫా కింద బయటపడ్డ సొరంగం..: ప్రకటించిన ఇజ్రాయెల్‌

అల్‌-షిఫా ఆస్పత్రిపై ఆపరేషన్‌లో ఇజ్రాయెల్‌ కొంత పురోగతి సాధించింది. ఆస్పత్రి ప్రాంగణంలో ఓ సొరంగాన్ని కనుగొంది. మరోవైపు ఇజ్రాయెల్‌ ప్రధాని మాట్లాడుతూ కొన్ని రోజులు హమాస్‌ బందీలను ఈ ఆస్పత్రిలోనే ఉంచిందని పేర్కొన్నారు.

Updated : 17 Nov 2023 10:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్‌-షిఫా కింద సొరంగాన్ని కనుగొన్నట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ప్రకటించింది. దీనికి సబంధించిన ఫొటోలు, వీడియోలను శుక్రవారం విడుదల చేసింది. ‘‘ఆస్పత్రిలోని హమాస్‌ సొరంగం నెట్‌వర్క్‌ను గుర్తించాం’’ అని ఇజ్రాయెల్‌ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.

విభేదాలు పరిష్కరించుకోదగ్గవే

ఆ దేశ ప్రత్యేక దళాలు బుధవారం తెల్లవారుజామున తొలిసారి అల్‌-షిఫా ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టాయి. ఆ తర్వాత ఎమ్మారై గదిలో భారీగా ఆయుధాలను గుర్తించాయి. అనంతరం నేడు సొరంగాన్ని కనుగొన్నారు. ఈ సొరంగం మూతను హమాస్‌ దళాలు కాంక్రీట్‌తో సీల్‌ చేసినట్లు ఉంది. దీనిలోకి వెళ్తున్న పైపులు, కేబుల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు అక్కడ ఆయుధాలు దాచిన ప్రాంతంలో పేలుడు పదార్థాలతో ఓ ఉచ్చును అమర్చిన కారును అడ్డంపెట్టినట్లు తాము గుర్తించామన్నారు. ఇక తమ ఇంజినీర్లు టన్నెల్‌ నెట్‌వర్క్‌ను బయటపెట్టడానికి తీవ్రంగా యత్నిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ అధికారులు వెల్లడించారు.

బందీలను అల్‌-షిఫాలో ఉంచినట్లు ఆధారాలున్నాయి

ఇజ్రాయెల్‌ నుంచి కిడ్నాప్‌ చేసిన బందీలను అల్‌-షిఫా ఆస్పత్రిలో ఉంచినట్లు తమ వద్ద బలమైన సంకేతాలున్నాయని ఆ దేశా ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. తమ సైన్యం దానిపై ఆపరేషన్‌ మొదలుపెట్టడంతో ప్రస్తుతానికి వారిని అక్కడి నుంచి వేరే స్థావరానికి తరలించారని పేర్కొన్నారు. కొన్ని రోజుల కిందటి వరకూ హమాస్‌ అక్కడ కార్యకలాపాలను నిర్వహించిందన్నారు. ఆ వైద్యశాలలోకి తమ దళాలు అడుగుపెట్టడానికి అదే ప్రధాన కారణమని తెలిపారు. బందీలకు సంబంధించి తమ ప్రభుత్వం వద్ద కీలకమైన ఇంటెలిజెన్స్‌ ఉందని.. ఆ వివరాలను తాము బహిర్గతం చేయలేమని పేర్కొన్నారు. తమ బలగాలు ఆస్పత్రిలో కచ్చితమైన లక్ష్యాలపైనే దాడులు చేస్తున్నాయని అన్నారు.

హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై నెతన్యాహు స్పందిస్తూ గ్రౌండ్‌ ఆపరేషన్‌ విజయవంతంగా కొనసాగుతోందని.. హమాస్‌ కాల్పుల విరమణ ప్రకటించేలా ఒత్తిడి పెంచుతున్నామని వెల్లడించారు. హమాస్‌ మొత్తం బందీలను విడుదల చేస్తేగానీ.. తాము పాలస్తీనా బందీలను విడుదల చేస్తామన్న ప్రచారంపై మాత్రం నెతన్యాహు ఏమీ మాట్లాడలేదు. కేవలం ‘రహస్యం’ అని మాత్రమే చెప్పారు. పాలస్తీనాలో నాయకత్వ మార్పు అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘‘పాలస్తీనీయులు వారిని వారు పాలించుకొనే అధికారం ఉంది. కానీ, ఇజ్రాయెలీలను భయపెట్టే అధికారం మాత్రం లేదు. అంటే గాజాను నిస్సైనికీకరణ చేయడంతోపాటు.. డీర్యాడికలైజ్‌ చేస్తాం’’ అని నెతన్యాహు స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని