Dubai Floods: ‘దుబాయ్‌ ప్రయాణాలను రీషెడ్యూల్‌ చేసుకోండి’ - ఇండియన్‌ ఎంబసీ అడ్వైజరీ

దుబాయ్‌కు వచ్చేవారు, అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్‌ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీలో పేర్కొంది.

Updated : 19 Apr 2024 17:15 IST

అబుదాబీ: దుబాయ్‌లో వరదల (Dubai Floods) నేపథ్యంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది. దుబాయ్‌కు వచ్చేవారు, స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్‌ చేసుకోవాలని తాజా అడ్వైజరీలో పేర్కొంది. భారీ వరదల నేపథ్యంలో కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చేంతవరకు ఈ సూచనలు పాటించాలని తెలిపింది.

‘దుబాయ్‌ (Dubai)తోపాటు సమీప ప్రాంతాలను ఇటీవల వరదలు ముంచెత్తాయి. ఊహించని వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఇన్‌బౌండ్‌ విమానాల సంఖ్యను పరిమితం చేసింది. కార్యకలాపాలు సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు యూఏఈ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విమానాలు బయలుదేరే తేదీ, సమయానికి సంబంధించి సదరు విమానయాన సంస్థ నుంచి ధ్రువీకరణ వచ్చిన తర్వాతే ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వెళ్లాలి’ అని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.

Dubai Floods: ఎడారి దేశంలో ఎందుకీ వరదలు..?

భారత పౌరులకు అవసరమైన సహాయం అందించేందుకు దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేసిందని తెలిపింది. ఏప్రిల్‌ 17 నుంచి ఇది అందుబాటులో ఉందని పేర్కొంది. ఇదిలాఉంటే, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయమైన దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేందుకు మరో 24 గంటలు పట్టవచ్చని అంచనా.

ఎయిరిండియా విమానాలు రద్దు..

దుబాయ్‌లో వరదల నేపథ్యంలో ఎయిరిండియా కూడా భారత్‌ నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసులను రద్దు చేస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికులకు కలుగుతోన్న అసౌకర్యంపై విమానయాన సంస్థ స్పందించింది.  కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్న వెంటనే.. ప్రభావితమైన వినియోగదారులకు ఇతర విమానాల్లో వెళ్లే సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది. ఏప్రిల్‌ 21 వరకు తమ విమానాల్లో బుకింగ్‌ చేసుకున్న వారికి ఒకసారి రీషెడ్యూల్‌ చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఒకవేళ టికెట్‌ క్యాన్సలేషన్‌ చేసుకుంటే పూర్తి సొమ్మును తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని