Iran-Israel: డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్‌.. ‘నో కామెంట్స్‌’ అంటున్న ఇజ్రాయెల్‌

Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్‌ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్‌ సైన్యం నిరాకరించింది.

Updated : 19 Apr 2024 10:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌ (Iram)లో శుక్రవారం తెల్లవారుజామున పలు చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఇవి ఇజ్రాయెల్‌ (Israel) ప్రతీకార దాడులేనని అమెరికా చెబుతోంది. అయితే వీటిని ధ్రువీకరించేందుకు మాత్రం ఇజ్రాయెల్‌ నిరాకరించింది. మరోవైపు తమ గగనతలంలోకి చొచ్చుకొచ్చిన పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్‌ వెల్లడించింది.

ఇరాన్‌లో (Iran) అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో శుక్రవారం వేకువజామున భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో అధికారులు వెంటనే గగనతల రక్షణ వ్యవస్థలను (Iran Air Defence System) యాక్టివేట్ చేశారు. ఇప్పటి వరకు మూడు డ్రోన్లను కూల్చివేసినట్లు ఆ దేశ జాతీయ సైబర్‌ స్పేస్‌ సెంటర్‌ అధికార ప్రతినిధి హొస్సేన్‌ డల్లిరియాన్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతానికి క్షిపణి దాడులు జరిగినట్లు ఆధారాల్లేవని తెలిపారు.

ఇరాన్‌లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్‌ !

అటు ఇస్ఫహాన్ నగరంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇక్కడి అణు కేంద్రంపై ఎలాంటి దాడి జరగలేదని, అది సురక్షితంగా ఉందని ఇరాన్‌ మీడియా వెల్లడించింది. అయితే ఈ నగరంలోని ఎయిర్‌పోర్టు, ఎయిర్‌బేస్‌ సమీపంలో పేలుళ్లు సంభవించినట్లు పేర్కొంది. ఈ ఘటనలో ప్రాణ నష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఇస్ఫహాన్, షిరాజ్‌, టెహ్రాన్‌ మీదుగా విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు ఇరాన్‌ జాతీయ మీడియా వెల్లడించింది.

చెప్పలేం: ఇజ్రాయెల్‌

ఇరాన్‌లో పేలుళ్లు ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులేనని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. కానీ, దీనిపై స్పందించేందుకు ఇజ్రాయెల్‌ సైన్యం నిరాకరించింది. ‘ప్రస్తుతానికి మేం ఏం మాట్లాడలేం’’ అని పేర్కొనడం గమనార్హం. మరోవైపు, ఈ దాడులకు కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్‌, అమెరికా రక్షణ మంత్రులు ఫోన్లో మాట్లాడుకున్నట్లు పెంటగాన్‌ వెల్లడించింది. అయితే, అందులో ఈ దాడి ప్రణాళికల గురించి ఇజ్రాయెల్‌ ప్రస్తావించలేదని తెలిపింది. కానీ, రానున్న 24-48 గంటల మధ్యలో ఇరాన్‌పై దాడి చేస్తామని మాత్రం సూచనప్రాయంగా అగ్రరాజ్యానికి చెప్పినట్లు తెలుస్తోంది. 

ఇజ్రాయెల్‌ను వీడండి: ఆస్ట్రేలియా సూచన

తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇజ్రాయెల్‌లోని ఆస్ట్రేలియన్లు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని హెచ్చరించింది. ఈ దాడులతో గగనతలాన్ని మూసివేసే అవకాశముందని హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని