Iran-Israel Tensions: ఇరాన్‌లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్‌!

Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్‌ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. 

Updated : 19 Apr 2024 15:03 IST

Iran-Israel Tensions | టెహ్రాన్‌: ఇజ్రాయెల్‌ (Israel) అన్నంత పనీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇరాన్‌ చేసిన దాడులకు ప్రతీకారంగా ఆ దేశం క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికాకు చెందిన ఓ సైనికాధికారి వెల్లడించారు. ఇరాన్‌లో (Iran) శుక్రవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించినట్లు వార్తలు వెలువడిన కాసేపటికే సదరు అధికారి ఈ విధంగా స్పందించారు. తమ దేశంపై పరిమిత స్థాయిలో దాడికి దిగినా.. పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని ఇజ్రాయెల్‌ను ఇరాన్‌ ప్రధాని ఇబ్రహీం రైసీ హెచ్చరించిన రోజు వ్యవధిలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాము మరింత భారీ దాడులకు దిగితే ఇజ్రాయెల్‌ మిగలదని ఆయన తేల్చి చెప్పారు.

ఇరాన్‌లో (Iran) అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. అవి ఏంటనేది ఇంకా అక్కడి ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. కానీ, ముందు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా గగనతలాన్ని మూసివేసింది. వాణిజ్య, పౌర విమానాలకు అనుమతులను రద్దు చేసింది. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఆ నగరంలో అతిపెద్ద సైనిక శిబిరంతో పాటు పలు అణు కేంద్రాలు ఉన్నాయి. 

ఇజ్రాయెల్‌ X ఇరాన్‌.. ఎవరి బలం ఎంత?

మరోవైపు ఇరాన్‌ తమ గగనతల రక్షణ వ్యవస్థను (Iran Air Defence System) యాక్టివేట్ చేసినట్లు అక్కడి అధికారిక మీడియా ఐఆర్‌ఎన్‌ఏ వెల్లడించింది. అలాగే ఎయిర్‌ డిఫెన్స్‌ బ్యాటరీలను మోహరించింది. గుర్తు తెలియని మినీ డ్రోన్లను ధ్వంసం చేయడానికి ఈ చర్యలు తీసుకొన్నట్లు ఓ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ ఇరాన్‌ మీడియా ఐఆర్‌ఐబీ వెల్లడించింది.

ఇదీ నేపథ్యం...

సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన గగనతల దాడి ఇజ్రాయెల్‌ పనేనని ఇరాన్‌ భావిస్తోంది. ఆ దాడిలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ దళానికి చెందిన ఏడుగురు సైనికాధికారులు మృతి చెందారు. దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన ఇరాన్‌.. శనివారం ఏకంగా 170 డ్రోన్లు, 30కి పైగా క్రూజ్‌, 120కి పైగా బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడింది. ‘ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌’ పేరుతో విడతల వారీగా డ్రోన్లను ప్రయోగించింది. తర్వాత సైనిక స్థావరాలే లక్ష్యంగా క్రూజ్‌, బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేసింది. 

దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్‌.. ఇరాక్‌ గగనతలం మీదుగా వస్తున్న డ్రోన్లను బహుళ అంచెల రక్షణ వ్యవస్థతో కూల్చివేసింది. క్రూజ్‌ క్షిపణులనూ విజయవంతంగా అడ్డుకుంది. ‘ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌’లో ఇరాన్‌తో పాటు.. ఆ దేశానికి మద్దతిస్తున్న లెబనాన్‌, సిరియా, ఇరాక్‌లోని మిలిటెంట్‌ సంస్థలూ పాల్గొన్నాయి. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, రాకెట్ల వర్షం కురిపించాయి. వాటన్నిటినీ అమెరికా సహకారంతో టెల్‌ అవీవ్‌ సమర్థంగా తిప్పికొట్టింది. అప్పటి నుంచి ఇరాన్‌పై ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్‌ హెచ్చరిస్తూ వచ్చింది. అమెరికా సహా ప్రపంచ దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ.. టెల్‌ అవీవ్‌ మాత్రం తన ప్రణాళికలను అమలు చేసింది! తాజా పరిణామాలు పశ్చిమాసియా ప్రాంతాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని