Israel-Hamas: ఇజ్రాయెల్ బలైంది వాస్తవమే.. కానీ..: బైడెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Israel-Hamas Conflict: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden).. ఇజ్రాయెల్ పర్యటన ముగించుకుని బయల్దేరారు. గాజాలో చిక్కుకుపోయిన పౌరుల బాధలను తీర్చే మార్గాలను కూడా ఇజ్రాయెల్‌ అన్వేషించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

Updated : 19 Oct 2023 10:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హమాస్‌ (Hamas)పై పోరు సాగిస్తున్న ఇజ్రాయెల్‌ (Israel)కు తమ పూర్తి మద్దతు ప్రకటించేందుకు అమెరికా (USA) అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) టెల్‌ అవీవ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu)తో ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌ దారుణంగా బలైందని (హమాస్‌ మిలిటెంట్ల దాడులను ఉద్దేశిస్తూ) అన్నారు. అయితే, గాజా (Gaza) వాసుల బాధను పోగొట్టే మార్గాలను కూడా ఇజ్రాయెల్‌ అన్వేషించాలని సూచించారు.

ఇజ్రాయెల్‌ పర్యటన ముగించి బైడెన్‌ వాషింగ్టన్‌కు తిరుగుపయనమయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌ బాధిత దేశం అనేది వాస్తవం. కానీ, మరో విషయం ఏంటంటే.. గాజా నుంచి ఎటూ వెళ్లలేని అమాయక పౌరుల బాధను తీర్చే అవకాశం గనుక వారికి (ఇజ్రాయెల్‌ను ఉద్దేశిస్తూ) ఉంటే.. ఆ దిశగా చర్యలు చేపట్టాలి. ఒకవేళ అలా చేయలేకపోతే.. జరిగేదానికి వారిని బాధ్యుల్ని చేస్తారు. అది బహుశా అన్యాయమే అవుతుంది. ఇక్కడ నేను చెప్పేది ఒక్కటే.. ఒకరి బాధను తగ్గించే అవకాశముంటే.. తగ్గించాలి. లేదంటే ప్రపంచం దృష్టిలో మనం విశ్వసనీయతను కోల్పోతాం. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నా’’ అని అన్నారు.

రఫా సరిహద్దు క్రాసింగ్‌ తెరిచేందుకు అంగీకరించిన ఈజిప్ట్‌.. గాజాకి అందనున్న మానవతా సాయం

అమెరికా క్యాపిటల్‌ను తాకిన యుద్ధ సెగ..

మరోవైపు.. ఇజ్రాయెల్-హమాస్‌ యుద్ధ సెగ అమెరికా క్యాపిటల్‌ భవనాన్ని తాకింది. హమాస్‌పై ఇజ్రాయెల్‌ దాడులను నిరసిస్తూ కొందరు ఆందోళనకారులు బుధవారం క్యాపిటల్ భవనాన్ని ముట్టడించారు. ఈ ఉద్రిక్తతలను ఆపేలా అమెరికా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆందోళనకారులను అడ్డుకున్నాయి. దాదాపు 300 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని