Israel: ‘గాజా పౌరుల ఆకలి కేకలు.. ఇజ్రాయెల్‌ యుద్ధ వ్యూహంలో భాగమే!’

గాజాలోని పౌరులను ఆకలి కేకలకు గురిచేయడాన్ని ఇజ్రాయెల్‌ ఓ యుద్ధతంత్రంగా అమలు చేస్తోందని ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌’ సంస్థ ఆరోపించింది.

Published : 19 Dec 2023 02:03 IST

జెరూసలెం: గాజా (Gaza)లోని పౌరులను ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆకలి కేకలకు గురిచేస్తోందని ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ (Human Rights Watch)’ సంస్థ ఆరోపించింది. ఇదంతా ఇజ్రాయెల్‌ యుద్ధతంత్రంలో భాగమేనని పేర్కొంది. ‘‘గాజాలోని పౌరులను ఆకలితో మాడ్చి చంపడాన్ని (Starvation) ఇజ్రాయెల్‌ (Israel) ఓ యుద్ధ తంత్రంగా అమలు చేస్తోంది. ఇది యుద్ధ నేరం’’ అని న్యూయార్క్‌కు చెందిన ఆ సంస్థ తన నివేదికలో తెలిపింది. అయితే.. ఈ ఆరోపణలను ఇజ్రాయెల్‌ తోసిపుచ్చింది. తమ దేశంలో చోటుచేసుకున్న అక్టోబరు 7నాటి మారణకాండను ఈ సంస్థ ఖండించలేదని గుర్తుచేసింది.

‘‘గాజాకు ఆహారం, నీళ్లు, ఇంధన సరఫరాలను ఇజ్రాయెల్‌ సైన్యం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోంది. మానవతా సాయాన్ని నిరోధిస్తోంది. వ్యవసాయ క్షేత్రాలనూ నాశనం చేస్తోంది. పౌరులకు వారి మనుగడకు అవసరమైన సామగ్రిని అందకుండా చేస్తోంది’’ అని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ పేర్కొంది. అయితే.. ఈ ఆరోపణలను ఇజ్రాయెల్‌ ఖండించింది. హెచ్‌ఆర్‌డబ్ల్యూను యూదు, ఇజ్రాయెల్‌ వ్యతిరేక సంస్థగా పేర్కొంది. ఇజ్రాయెల్‌ వాసుల హక్కుల ఉల్లంఘనపై కళ్లు మూసుకున్న ఈ సంస్థకు.. గాజాలో ప్రస్తుతం జరుగుతోన్న దానిపై మాట్లాడే నైతిక అర్హత లేదని ఇజ్రాయెల్‌ విదేశాంగ ప్రతినిధి లియర్ హయాత్‌ ఓ వార్తాసంస్థకు చెప్పారు.

హమాస్‌ అతిపెద్ద సొరంగం ఇలా.. వీడియో విడుదల..!

అక్టోబరు 7న హమాస్‌ ఉగ్రవాదుల మెరుపు దాడుల నేపథ్యంలో.. అందుకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గాజాను దిగ్బంధం చేయడంతో.. స్థానికంగా ఆహారం, నీళ్లు, ఇంధనం, ఔషధాల కొరత నెలకొంది. అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు ఈజిప్టు- గాజా సరిహద్దులోని రఫా కేంద్రం గుండా పాలస్తీనీయన్లకు కొంత మానవతా సాయానికి ఇజ్రాయెల్‌ అనుమతించింది. ఇటీవల తన ‘కెరెమ్ షాలోమ్ క్రాసింగ్’ ద్వారా కూడా గాజాకు అత్యవసర సాయం చేరవేయడానికి అంగీకరించింది. దీంతో ఈ క్రాసింగ్ గుండా ఆదివారం కొన్ని ట్రక్కులు గాజాలోకి ప్రవేశించాయని రెడ్‌ క్రీసెంట్ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని