Israel Hamas War: ఇజ్రాయెల్‌ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!

2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ‘అంతర్జాతీయ నేర న్యాయస్థానం’ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఇజ్రాయెల్‌లో ఆందోళన నెలకొంది.

Published : 29 Apr 2024 17:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గాజాపై విరుచుకుపడుతోన్న వేళ.. ఇజ్రాయెల్‌ (Israel)కు ‘అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ICC)’ గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ ఊహాగానాలపై కోర్టు నుంచి ఎటువంటి సూచనలు లేనప్పటికీ.. విదేశాంగశాఖ మాత్రం ఇతర దేశాల్లోని తమ దౌత్య మిషన్లకు ఈమేరకు సమాచారం అందించింది. న్యాయస్థానం ఈ చర్యలు తీసుకోకూడదని.. హమాస్, ఇతర మిలిటెంట్ గ్రూపులకు ఇవి నైతిక ప్రోత్సాహాన్ని అందిస్తాయని విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు.

2014 నాటి గాజా యుద్ధంలో ఇజ్రాయెల్‌, హమాస్‌ మిలిటెంట్లు యుద్ధనేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అంతర్జాతీయ నేర న్యాయస్థానం మూడేళ్ల క్రితం విచారణను ప్రారంభించింది. పాలస్తీనియన్లు తమ భవిష్యత్తు దేశం కోసం కోరుతున్న భూభాగంలో ఇజ్రాయెల్ స్థావరాలను నిర్మించడం వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకుంది. ‘ఐసీసీ’ ప్రాసిక్యూటర్ కరీంఖాన్ గత డిసెంబర్‌లో ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. విచారణ వేగంగా, బలమైన సాక్ష్యాల ఆధారంగా చర్యలు తీసుకోవాలనే లక్ష్యంతో ముందుకుసాగుతోందని తెలిపారు. అయితే.. ఈ కేసులో వారెంట్ల జారీపై ఇటీవల కాలంలో ఎటువంటి సూచనలు ఇవ్వలేదు.

అతడి హత్యకు పుతిన్‌ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా

తమ దేశ ఆత్మరక్షణ హక్కును అణగదొక్కేందుకు ‘ఐసీసీ’ చేసే ఏ ప్రయత్నాన్నీ ఎప్పటికీ అంగీకరించబోమని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల స్పష్టం చేశారు. ‘‘మధ్య ప్రాచ్యపు ఏకైక ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రపంచంలోని ఒకే ఒక్క యూదు దేశానికి చెందిన సైనికులు, అధికారులకు అరెస్టు బెదిరింపులు దారుణం. మేం దానికి తలొగ్గం” అని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ దేశం ‘ఐసీసీ’ అధికార పరిధిని అంగీకరించలేదు. ఒకవేళ వారెంట్లు జారీ అయితే.. ఆ దేశ అధికారులను ఇతర దేశాల్లో అరెస్టు చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే గాజాలో భీకర దాడులపై నిరసనలు వ్యక్తమవుతోన్న వేళ.. ఈ పరిణామం టెల్‌అవీవ్‌కు శరాఘాతంగా మారే అవకాశం ఉంది.

మరోవైపు.. ప్రస్తుతం కొనసాగుతోన్న యుద్ధంలో భాగంగా గాజాలో ఇజ్రాయెల్‌ మారణహోమానికి పాల్పడిందా? అనే కోణంలో అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) విచారణ జరుపుతోంది. అయితే.. ఈ ఆరోపణలను నెతన్యాహూ ప్రభుత్వం ఇప్పటికే కొట్టిపారేసింది. రెండు అంతర్జాతీయ న్యాయస్థానాలూ పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయని ఆరోపించింది. ఇదిలాఉండగా.. రఫా ప్రాంతంపై టెల్‌అవీవ్‌ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా 22 మంది మృతి చెందారు. మృతుల్లో 5 రోజుల పసిపాప సహా ఐదుగురు చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని