Alexei Navalny: అతడి హత్యకు పుతిన్‌ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా

రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్‌స్ట్రీట్‌ పత్రిక ఓ కథనం ప్రచురించింది.

Published : 29 Apr 2024 10:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ  (Alexei Navalny) మరణం వెనుక పుతిన్‌ ఆదేశాలు జారీ చేయలేదని అమెరికా నిఘా వర్గాలు ఓ అభిప్రాయానికి వచ్చాయి. చాలా కాలంగా జైల్లో ఉన్న నావల్నీ ఈ ఏడాది ఫిబ్రవరిలో మరణించారు. అంతిమంగా అతడి మృత్యువుకు మాత్రం పుతిన్‌ కారణమయ్యారని చెబుతున్నారు. పుతిన్‌ రష్యా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికవ్వడానికి సరిగ్గా ముందు  ఈ ఘటన చోటు చేసుకొంది. 

మరోవైపు నాడు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కూడా స్పందిస్తూ..  నావల్నీ మరణానికి పుతిన్‌ బాధ్యుడని పేర్కొన్నారు. అతడి క్రూరత్వానికి ఈ మరణం ఓ ఉదాహరణ అని అభివర్ణించారు. ఎవరినీ రష్యన్లు ఫూల్స్‌ చేయలేరని వ్యాఖ్యానించారు. కానీ, కచ్చితమైన కారణాలు చెప్పలేకపోయారు. ఇక రష్యా అధికారులు మాత్రం నావల్నీ మరణం పూర్తిగా సహజమైన కారణాలతోనే చోటు చేసుకొందని చెబుతున్నారు. అతడిపై విషప్రయోగం, హత్యకు ఎటువంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. 

అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న నాయకుడు అలెక్సీ నావల్నీ (Alexei Navalny). ‘రష్యా ఆఫ్ ది ఫ్యూచర్’‌ పార్టీ నేతగా అక్కడి ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని బయటపెట్టారు. గత అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా ఆదరణ లభించింది. ఈ క్రమంలోనే 2020లో సెర్బియా పర్యటనలో ఉన్నప్పుడు అతడిపై విషప్రయోగం జరగడం సంచలనం సృష్టించింది. జర్మనీలో కొన్ని నెలల పాటు చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడి.. 2021 జనవరిలో రష్యాకు తిరిగొచ్చారు. అయితే, వచ్చీ రాగానే రష్యా పోలీసులు ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. నిధుల దుర్వినియోగం సహా పలు అభియోగాలపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు అప్పట్లో రష్యా అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా వివిధ కేసుల్లో 19 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని