Russia: విమాన ప్రమాదంలో ప్రిగోజిన్‌ మృతి!

అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసి వెనక్కి తగ్గిన రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూపు అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్‌(62) బుధవారం విమాన ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది.

Updated : 24 Aug 2023 05:44 IST

మాస్కో నుంచి వెళ్తుండగా కూలిపోయిన ప్రైవేటు జెట్‌  
అందులోని 10 మంది దుర్మరణం
ప్రయాణికుల జాబితాలో ఆయన పేరు
విమానంలో ఉన్నదీ లేనిదీ నిర్ధారణ కాలేదు: అధికారులు

మాస్కో: అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసి వెనక్కి తగ్గిన రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూపు అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్‌(62) బుధవారం విమాన ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది. ప్రైవేటు జెట్‌ విమానం మాస్కో నుంచి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, విమానంలోని 10 మందీ మరణించారని, ప్రయాణికుల జాబితాలో ప్రిగోజిన్‌ పేరు ఉందని, అయితే విమానంలో ఆయన ఉన్నారో లేదో నిర్ధారణ కాలేదని రష్యా అత్యవసర విభాగం అధికారులు తెలిపారు. ఆ విమానం ప్రిగోజిన్‌దేనని చెప్పారు. మాస్కోకు ఉత్తరాన ఉన్న త్వేర్‌ రీజియన్‌లో ఎంబ్రాయర్‌ విమానం కూలిపోయిందని, దర్యాప్తు జరుపుతున్నామని రష్యా విమానయాన సంస్థ రోసావియాత్సియా ప్రకటించింది. మరణించిన వారిలో ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు.

సన్నిహితుడే శత్రువైన వేళ..

వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత ప్రిగోజిన్‌ ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరఫున క్రియాశీలంగా పోరాడారు. పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. 1981లో దొంగతనం, దోపిడీ కేసుల్లో 12 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన చరిత్ర ప్రిగోజిన్‌ది. జైలు నుంచి విడుదలైన తర్వాత రకరకాల వ్యాపారాలు చేశారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో పలు రెస్టారెంట్లను నెలకొల్పారు. ఇక్కడే పుతిన్‌తో ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. క్రమంగా అతడు అధ్యక్షుడి ఆంతరంగికుల్లో ఒకడిగా ఎదిగారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ డిప్యూటీ మేయర్‌గానూ పని చేశారు. రష్యా ప్రభుత్వ ఆహార కాంట్రాక్టులన్నీ ఆయనవే. అలా అంచెలంచెలుగా అధ్యక్షుడి అండతో ఆర్థికంగా ఎదిగి వాగ్నర్‌ ముఠాకు అధినేత అయ్యారు. వాగ్నర్‌ గ్రూపు ఆఫ్రికాలోని మాలి తదితర చోట్ల పనిచేస్తోంది. వాగ్నర్‌ బృందంలో 90 శాతం మంది ఖైదీలే అని అమెరికా ఓ నివేదికలో పేర్కొంది. హత్య, ఇతర క్రూర నేరాలు చేసిన వ్యక్తులను వాగ్నర్‌ ముఠా సైనికులుగా చేర్చుకుంటుంది. ప్రిగోజిన్‌ అగ్రరాజ్యాల వాంటెడ్‌ జాబితాలో ఉన్నాడు. గత జూన్‌లో పుతిన్‌పై వాగ్నర్‌ గ్రూపు చేసిన ఒక్కరోజు తిరుగుబాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తిరుగుబాటు మొదలుపెట్టిన కొద్దిసేపటికే ప్రిగోజిన్‌ సేన వెనక్కి తగ్గింది. ఆయన ఇటీవలే పుతిన్‌తో భేటీ అయ్యారు. బెలారస్‌లో అతనికి పుతిన్‌ ఆశ్రయమిచ్చారు. వాగ్నర్‌ గ్రూపు సభ్యులు రిటైరవడానికిగానీ, రష్యా సైన్యంలో చేరడానికిగానీ అనుమతించారు. ఈ నేపథ్యంలో విమాన ప్రమాదం చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని