Japan PM: అణు జలాల భయం వేళ.. చేపను తిన్న జపాన్‌ ప్రధాని

Japan PM Fumio Kishida: పసిఫిక్‌ మహా సముద్రంలోకి అణు వ్యర్థ జలాల విడుదలపై భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. జపాన్‌ ప్రధాని కిషిదా ఫుకుషిమా చేపలను ఆరగించారు.

Published : 31 Aug 2023 17:35 IST

టోక్యో: జపాన్‌ (Japan)లో 2011లో సంభవించిన సునామీ కారణంగా దెబ్బతిన్న ఫుకుషిమా అణు విద్యుత్‌ కేంద్రం (Fukushima Nuclear Plant)లో పేరుకుపోయిన రేడియో ధార్మిక వ్యర్థ జలాలను (radioactive water) పసిఫిక్‌ మహా సముద్రంలోకి విడుదల చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. అణు వ్యర్థ జలాలు సముద్రంలో కలవడం వల్ల కాలుష్యం పెరగడమే గాక.. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లితుందని చైనా, దక్షిణ కొరియా తదితర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ భయాలను పోగొట్టేందుకు జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిదా (Fumio Kishida) చేసిన పని ఆసక్తికరంగా మారింది. అణు వ్యర్థ జలాలను విడుదల చేసిన ఫుకుషిమా తీరంలో పట్టిన చేపను తిన్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోను జపాన్‌ ప్రధాని కార్యాలయం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అందులో కిషిదాతో పాటు మరో ముగ్గురు అధికారులు ఫుకుషిమా చేపలను ఆరగిస్తూ కన్పించారు. ‘‘ఇది చాలా బాగుంది. జపనీస్‌ సముద్ర ఆహారం రుచికరమైనది, సురక్షితమైనది’’ అని ప్రధాని ఆ వీడియోలో చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

శరణార్థుల భవనంలో అగ్నిప్రమాద ఘటన.. ఆ గేటు వెనుక అన్నీ కాలిన శవాలే..!

2011లో ఫుకుషిమా (Fukushima) అణు కేంద్రం సునామీ కారణంగా దెబ్బతిన్న నాటి నుంచి ఈ నీటిని భారీ ట్యాంకుల్లో నిల్వ చేశారు. కానీ, ఇప్పుడు నిల్వకు చోటు సరిపోని పరిస్థితికి చేరుకొంది. ఇక్కడ మొత్తం 1.34 మిలియన్‌ టన్నుల అణు జలాలు ఉన్నాయి. వీటిల్లో ముందుగా 200 నుంచి 210 క్యూబిక్‌ మీటర్ల నీటిని శుద్ధి చేసి సముద్రంలోకి వదిలేసింది. ఏదైనా అసాధారణ ఫలితాలు కనిపిస్తే తక్షణమే నీటి విడుదలను నిలిపివేసి దర్యాప్తు చేపడతామని ఇటీవల టోక్యో ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ (టెప్కో) వెల్లడించింది.

500 ఒలింపిక్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌కు సమానమైన ఈ నీటిని పూర్తిగా విడుదల చేయాలంటే కొన్ని దశాబ్దాలు పట్టనుంది. వీటిని వివిధ దశల్లో శుద్ధి చేసి రానున్న 30 ఏళ్లలో పూర్తిగా సముద్రంలో కలిపేందుకు జపాన్‌ చర్యలు చేపట్టింది. అయితే, ఈ అణుజలాల్లో ట్రీటియం, కార్బన్‌-14 మూలకాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అణుజలాల కారణంగా మత్స్యసంపద నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జపాన్‌ సముద్ర ఆహారంపై ఆందోళనలను పోగొట్టేందుకు ప్రధాని ఇలా ఫుకుషిమా చేపలను తిన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని