Fire Accident: శరణార్థుల భవనంలో అగ్నిప్రమాద ఘటన.. ఆ గేటు వెనుక అన్నీ కాలిన శవాలే..!

దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌ (Johannesburg)లో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ భవనంలో ఉన్నవారంతా శరణార్థులేనని అధికారులు తెలిపారు. ఇక మృతుల సంఖ్య 70 దాటింది.

Updated : 31 Aug 2023 16:31 IST

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా (South Africa)లోని జోహన్నెస్‌బర్గ్‌ (Johannesburg)లో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాద (Fire Accident) ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇక ప్రమాదం జరిగిన భవనంలో ఉన్నవారంతా శరణార్థులే (migrants)నని తెలిసింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 73 మృతదేహాలను అధికారులు గుర్తించారు. మరో 52 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు.

జోహన్నెస్‌బర్గ్‌లోని ప్రముఖ సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్‌లో గల ఓ ఐదంతస్తుల భవనంలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చూస్తుండగానే మంటలు భవనమంతా వ్యాపించాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రస్తుతానికి మంటలు కి తగ్గినప్పటికీ.. భవనమంతా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోందని ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 73 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమయంలో భవనంలో దాదాపు 200 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా అనేక మంది చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు చెబుతున్నారు.

అంతా శరణార్థులే..

సాధారణంగా ఈ నగరంలోని చాలా ప్రాంతాల్లో అనేక భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఇందులో చాలా వరకు క్రిమినల్‌ సిండికేట్ల అధీనంలో ఉన్నాయి. వీరంతా ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థుల నుంచి అద్దెలు తీసుకుంటూ వారిని అక్రమంగా ఈ భవనాల్లో ఉండేందుకు అనుమతిస్తున్నారు. తాజాగా ప్రమాదం జరిగిన భవనంలోనూ అలాంటి శరణార్థులే ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

అమెరికాలో మూడు రాష్ట్రాలను వణికిస్తున్న ఐడాలియా

సెక్యూరిటీ గేట్‌కు తాళం వేయడంతో..

ఇక, ప్రమాదం జరిగిన భవనంలో ఓ సెక్యూరిటీ గేట్‌ ఉంది. ఆ గేట్‌కు తాళం వేసి ఉంది. దీంతో మంటలు చెలరేగిన సమయంలో అందులో చిక్కుకున్న వారంతా వెంటనే బయటకు రాలేకపోయారని అధికారులు తెలిపారు. సహాయక చర్యల సమయంలో ఆ గేట్‌ను బద్దలుకొట్టగా.. దాని వెనుక అనేక కాలిన మృతదేహాలు కన్పించడం ఈ విషాదాన్ని అద్దం పడుతోంది.

ప్రమాదానికి కారణమదేనా..?

ఈ భవనంలో దాదాపు 80 వరకు చిన్న చిన్న గుడిసెల్లాంటి నిర్మాణాలున్నాయి. వీరిలో దాదాపు 200 మంది వరకు నివసిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. శరణార్థులు ఇలా భవనాల్లో అక్రమంగా నివసిస్తూ ప్రమాదంలో పడకుండా ఉండేందుకే.. ఇక్కడి మున్సిపాలిటీ నిరుపయోగంగా వదిలేసిన భవనాలకు విద్యుత్‌, నీటి సరఫరాను నిలిపివేసింది. అయినప్పటికీ శరణార్థులు అక్కడే జీవనాలు సాగిస్తున్నారు.

కొవ్వత్తుల వెలుతురులో, చిన్న చిన్న పారాఫిన్‌ స్టవ్‌లపై వంట చేసుకుంటూ నివాసముంటున్నారు. కొందరైతే కట్టెల పొయ్యిలు కూడా ఉపయోగిస్తున్నారు. అన్ని వైపులా మూసి ఉండే ఇలాంటి భవనాల్లో పొయ్యిలు వినియోగించడం ప్రమాదకరం. తాజా అగ్నిప్రమాదం కూడా దానివల్లే జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద మృతుల్లో ఎక్కువ మంది టాంజానియా వాసులేనని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని