Abdulla Yameen: భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల

భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది.

Updated : 19 Apr 2024 04:50 IST

మాలే: చైనా (China) అనుకూలవాది, భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు (Maldives) మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ (Abdulla Yameen)కు పడిన జైలుశిక్షను హైకోర్టు రద్దు చేసింది. ఆదివారం పార్లమెంటు ఎన్నికల వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. 2013-18 మధ్యకాలంలో అధికారంలో ఉన్న సమయంలో ఆయన అవినీతి, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలు ఉన్నాయి.

పర్యటకం అభివృద్ధి కోసం ఒక చిన్న దీవిని లీజుకు ఇచ్చేందుకు ఓ ప్రైవేటు సంస్థ నుంచి లంచం తీసుకున్నట్లు ట్రయల్ కోర్టు గుర్తించింది. ఈ క్రమంలోనే 2002లో దోషిగా తేల్చి.. 11ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన జైలుకు వెళ్లారు. 2023లో తన స్నేహితుడైన మహమ్మద్‌ ముయిజ్జు గెలిచిన అనంతరం గృహ నిర్బంధానికి మారారు. విచారణలో లోపాలు ఉన్నాయంటూ తాజాగా ఈ శిక్షను హైకోర్టు పక్కన పెట్టింది. క్రిమినల్ విచారణను పునఃప్రారంభించాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించింది. దీంతో ఆయన విడుదలయ్యారు.

భారత్‌- మాల్దీవుల మధ్య దశాబ్దాలుగా కొనసాగిన ద్వైపాక్షిక మైత్రి 2013లో యమీన్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక కుదుపులకు లోనైంది. చైనా నుంచి ఆయన భారీగా రుణాలు తీసుకున్నారు. భారత వ్యతిరేక విధానాలను అవలంబించారు. తీరప్రాంతాల్లో గస్తీ కోసం దిల్లీ స్నేహపూర్వకంగా అందించిన రెండు హెలికాప్టర్లను వెనక్కి ఇచ్చేశారు. స్థానికంగా విమానాశ్రయ ఆధునికీకరణ కాంట్రాక్టు దక్కించుకున్న భారతీయ కంపెనీని పక్కకు తప్పించి, చైనా సంస్థకు కట్టబెట్టారు.

పర్యటకం కుదేలు.. దిగొచ్చిన మాల్దీవులు!

2018లో ఇబ్రహీం సొలిహ్‌ పాలన సమయంలో.. హిందూ మహాసముద్రంలో భారత్‌ సైనిక బలగాలను మోహరిస్తోందని ఆరోపిస్తూ యమీన్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ‘భారత్‌ వెళ్లిపోవాలి (ఇండియా ఔట్‌)’ పేరుతో పెద్దయెత్తున దుష్ప్రచారం నిర్వహించాయి. 2019లోనూ ఆయన ఒకసారి జైలుకు వెళ్లి.. రెండేళ్ల తర్వాత బయటకు వచ్చారు.

మాల్దీవులు ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు సైతం చైనాకు అనుకూలుడిగా పేరుంది. దేశ పాలకుడిగా ఎన్నికైనప్పటినుంచి ఆయన కూడా భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోన్న విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన భద్రతా బలగాలను తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని