Maldives: మాల్దీవుల్లో భారత్‌ బలగాలు.. రెండో బృందం వెనక్కి..

రెండో విడతలో భాగంగా మాల్దీవుల నుంచి భారత్‌ సైనికుల బృందం వెనక్కి వచ్చింది.

Published : 14 Apr 2024 17:35 IST

మాలె: మాల్దీవుల (Maldives) నుంచి భారత్‌ సైనికులు (Indian Military) వెనక్కి వచ్చే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో రెండో విడతగా మన బలగాలు వెనక్కి వచ్చాయి. వీరిలో భారత్‌ బహుమతిగా ఇచ్చిన హెలికాఫ్టర్‌లో విధులు నిర్వహిస్తున్న సైనిక సిబ్బంది ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) వెల్లడించారు.

‘‘ఇప్పటికే మొదటి బృందం వెళ్లిపోయింది. ఏప్రిల్ 9న రెండో విడతలో మరో సైనికుల బృందం ఉపసంహరించుకుంది. ఇక ఒక బృందం మాత్రమే ఉంది. ఇరు దేశాలు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం వాళ్లు కూడా మే 10లోపు వెళ్లిపోతారు’’ అని అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మాల్దీవులను భారత సైన్యం వదిలి వెళ్తుందని గతంలో తాను చేసిన హామీ దీంతో నెరవేరుతోందన్నారు.

రంగంలోకి అమెరికా.. ఇజ్రాయెల్‌కు ఇనుప కవచంలా ఉంటామన్న బైడెన్

అయితే, రెండో బ్యాచ్‌లో ఎంత మంది భారత సైనికులు వెళ్లిపోయారో వెల్లడించలేదు. వారి స్థానంలో శిక్షణ పొందిన భారతీయ పౌరులను నియమించారా? లేదా అనే విషయంపై స్పష్టతనివ్వలేదు. మొదటి విడతలో భాగంగా అడ్డూ నగరం నుంచి 25 మంది సైనికులు భారత్‌కు తిరిగి వెళ్లిన విషయం తెలిసిందే.

మాల్దీవుల్లో త్వరలో పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్న నేసథ్యంలో అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముయిజ్జు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్‌ సోలిపై విమర్శలు గుప్పించారు. ఆయన ఒక విదేశీ రాయబారి ఆదేశాల మేరకు నడుచుకునేవారని ఆరోపించారు. ఆ రాయబారి ఏ దేశానికి చెందినవారో ముయిజ్జు పేర్కొనలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని