Mysterious Object: ఆ అంతుచిక్కని వస్తువు.. భారత రాకెట్‌ శకలమే..!

ఇటీవల ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకొచ్చిన ఓ అంతుచిక్కని వస్తువు.. భారత్‌కు చెందిన ‘పీఎస్‌ఎల్‌వీ’ రాకెట్‌ శకలంగా గుర్తించారు. ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.

Updated : 14 Aug 2023 18:09 IST

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా తీరంలో ఓ అంతుచిక్కని వస్తువు (Mysterious Object) ఇటీవల కలకలం రేపిన విషయం తెలిసిందే. ధ్వంసమైన స్థితిలో భారీ స్థూపాకారపు రాగి రంగు లోహాపు వస్తువు ఇక్కడి గ్రీన్‌ హెడ్‌ పట్టణ తీరంలోకి కొట్టుకువచ్చింది. అయితే, అది భారత రాకెట్‌కు సంబంధించిన వస్తువని ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ (Australian Space Agency) తాజాగా వెల్లడించింది. ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి చేర్చే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) మూడో దశకు సంబంధించిన శకలంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. ఐరాస అంతరిక్ష ఒప్పందాలకు లోబడి.. తదుపరి చర్యల విషయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కలిసి పని చేస్తున్నట్లు పేర్కొంది.

ఆస్ట్రేలియా తీరంలో అంతుచిక్కని వస్తువు..!

జులై మూడో వారంలో ‘జురియన్‌ బే’లో ఈ భారీ వస్తువు వెలుగులోకి రాగా.. అది ఏంటనేది ఎవరికీ అంతుచిక్కలేదు. ఆ వస్తువుకు దూరంగా ఉండాలని స్థానికులను అధికారులు హెచ్చరించారు. అసలు అది ఎక్కడినుంచి వచ్చింది? ప్రమాదకరమా? కాదా? అని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు.. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అది 2014లో సముద్రంలో కూలిపోయిన మలేషియా విమానానికి సంబంధించిన శకలమేనని కొంతమంది చర్చించారు. ఆస్ట్రేలియా స్పేస్‌ ఏజెన్సీ మాత్రం.. ఏదైనా విదేశీ అంతరిక్ష ప్రయోగ వాహనానికి సంబంధించినది కావొచ్చని అంచనా వేసింది. తాజాగా అది భారత్‌కు చెందిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు సంబంధించిన శకలమని నిర్ధారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని