Abducting: భారీ ‘కిడ్నాప్‌’ కథ సుఖాంతం.. 300 మంది చిన్నారుల విడుదల!

నైజీరియాలో దాదాపు 300 మంది విద్యార్థులను అపహరించిన కిడ్నాపర్లు.. ఎట్టకేలకు వారిని సురక్షితంగా విడిచిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

Published : 24 Mar 2024 16:13 IST

అబుజా: ఆఫ్రికా దేశమైన నైజీరియా (Nigeria)లో దాదాపు 300 మంది విద్యార్థుల అపహరణ వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతమైంది. రెండు వారాల తర్వాత కిడ్నాపర్లు వారిని సురక్షితంగా విడిచిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా ఏజెన్సీల సమన్వయం, వ్యూహరచనతో ఇది సాధ్యమైనట్లు స్థానిక గవర్నర్‌ తెలిపారు. పిల్లలను క్షేమంగా వెనక్కి తీసుకురావడంలో దేశాధ్యక్షుడు బోలా టినుబు చొరవ చూపారని పేర్కొన్నారు.

కడునా రాష్ట్రం కురిగా పట్టణంలోని ఓ పాఠశాల నుంచి విద్యార్థులను ఈ నెల 7న సాయుధ వ్యక్తులు అపహరించుకుపోయారు. అడ్డుకునేందుకు యత్నించిన ఓ వ్యక్తిని కాల్చిచంపారు. విద్యార్థుల్ని తమతోపాటు సమీప అడవుల్లోకి తీసుకుపోయారు. చిన్నారుల్లో 12 ఏళ్లలోపు వారే కనీసం 100 మంది వరకు ఉన్నారు. వారిని విడుదల చేసేందుకు రూ.5 కోట్లు ఇవ్వాలని.. లేనిపక్షంలో పిల్లల్ని చంపేస్తామని బెదిరించారు.

రూ.ఐదుకోట్లు ఇవ్వకపోతే.. చిన్నారుల్ని చంపేస్తాం..!

నైజీరియాలో పిల్లల అపహరణ ఉదంతాలు గతంలోనూ ఉన్నా.. ఇంత భారీసంఖ్యలో జరగడం కలకలం రేకెత్తించింది. ఒక్కపైసా చెల్లించకుండా విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేస్తామని అధ్యక్షుడు టినుబు చెప్పారు. ఈ క్రమంలోనే వారు విడుదల కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. కిడ్నాపర్లకు డబ్బులు చెల్లించారా? లేదా? అన్న విషయం తెలియరాలేదు. ఇదిలా ఉండగా స్థానికంగా 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు 1,400 మంది విద్యార్థులు కిడ్నాప్ అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని