Israel: వారిని విడిచిపెట్టేదాక కాల్పుల విరమణ ఉండదు: నెతన్యాహు

హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న వారిని విడిచిపెట్టేవరకు గాజాలో కాల్పులు విరమించబోమని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు మరోసారి స్పష్టం చేశారు.

Published : 06 Nov 2023 02:05 IST

జెరూసలెం: గాజాలో కాల్పులు విరమించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు మరోసారి స్పష్టం చేశారు. గాజాలో ప్రజలకు సాయం అందించేందుకు వీలుగా ఇజ్రాయెల్‌-హమాస్‌ కాల్పులు విరమించాలని ప్రపంచదేశాలు కోరుతున్న నేపథ్యంలో నెతన్యాహు తమ వైఖరిని వెల్లడించారు.

దక్షిణ ఇజ్రాయెల్‌లోని రొమన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్థావరంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘హమాస్‌ చెరలో బందీలుగా ఉన్నవారంతా తిరిగి వచ్చేదాక కాల్పులు విరమించేది లేదు. హమాస్‌ను ఓడించే వరకు యుద్ధాన్ని కొనసాగిస్తాం. ఇంతకుమించి మరో ప్రత్నామ్యాయం లేదు. ఇదే విషయాన్ని మిత్రులకు, శత్రువులకు పదే పదే చెబుతున్నాం’’అని నెతన్యాహు అన్నారు. 

అణ్వాయుధ ప్రయోగానికీ అవకాశం : ఇజ్రాయెల్‌ మంత్రి వ్యాఖ్యలను తోసిపుచ్చిన ప్రధాని

జోర్డాన్‌లో అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ అంటోనీ బ్లికెన్‌తో ఖతార్‌, సౌదీ, ఈజిప్ట్‌, జోర్డాన్‌, యూఏఈకి చెందిన విదేశాంగ శాఖ మంత్రులు శనివారం సమావేశమయ్యారు. ఇజ్రాయెల్‌ను కాల్పులు విరమించేలా ఒప్పించాలని బ్లింకెన్‌ను కోరారు. అంతకుముందు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌ కూడా బ్లింకెన్‌తో ఇదే విషయంపై భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే కాల్పుల విరమణపై నెతన్యాహు మరోసారి స్పష్టతనిచ్చారు. మరోవైపు ఆదివారం రాత్రి గాజాస్ట్రిప్‌లో ఇంటర్నెట్‌, టెలికామ్‌ సర్వర్లను ఇజ్రాయెల్‌ నిలిపివేసింది. దీంతో తమ సేవల్ని గాజా ప్రజలకు అందించలేకపోతున్నట్లు టెలికామ్‌ సంస్థ పాల్‌టెల్‌ ప్రకటన విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని