Pakistan: రాజ్‌నాథ్‌ సింగ్‌ వార్నింగ్‌.. నోరుపారేసుకున్న పాకిస్థాన్‌

రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కుతూ.. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో దృఢనిశ్చయంతో ఉన్నట్లు తెలిపింది.

Published : 06 Apr 2024 23:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో దాడులకు పాల్పడి పాకిస్థాన్‌ (Pakistan)కు పారిపోయినా.. అక్కడ కూడా ఆ ఉగ్రవాదులను వదలబోమని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కుతూ.. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో దృఢనిశ్చయంతో ఉన్నట్లు తెలిపింది. ప్రాంతీయంగా శాంతిస్థాపన విషయంలో తమ నిబద్ధతను ఎల్లప్పుడూ ప్రదర్శిస్తున్నట్లు పాకిస్థాన్‌ విదేశాంగ కార్యాలయం పేర్కొనడం గమనార్హం. తనను తాను రక్షించుకునే సామర్థ్యం విషయంలో పాక్‌ దృఢ సంకల్పాన్ని చరిత్రే చాటుతుందని కారుకూతలు కూసింది. 

‘ఉగ్రవాదులు పాక్‌ పారిపోయినా’..: రక్షణమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్‌

ఇటువంటి పరిణామాలు ప్రాంతీయ శాంతిని బలహీనపరచడమే కాకుండా నిర్మాణాత్మక సంప్రదింపుల అవకాశాలను కూడా దెబ్బతీస్తాయని ఇస్లామాబాద్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల్లో ప్రయోజనాల కోసం ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని నోరుపారేసుకుంది. దీనిపై రాజ్‌నాథ్‌ బదులిస్తూ.. భారత్‌ ఎల్లప్పుడూ తన పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటుందని స్పష్టం చేశారు. ‘‘చరిత్ర చూస్తే.. ఇప్పటివరకు భారత్‌ ప్రపంచంలోని ఏ దేశంపైనా దాడి చేసి, భూమిని ఆక్రమించిన దాఖలాలు లేవు. ఇది భారత్‌ స్వభావం. అయితే, ఎవరైనా మా దేశంపై కన్నెర్ర చేస్తే.. ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు యత్నిస్తే మాత్రం వారిని వదిలిపెట్టం’ అని ఉద్ఘాటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని