Tokyo: ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు.. నిర్లక్ష్యమే కారణమా..?

టోక్యోలో మంగళవారం జరిగిన విమాన ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమన్న కోణంలో దర్యాప్తు మొదలైంది. ఇప్పటికే కోస్ట్‌గార్డ్‌ విమానం బ్లాక్‌బాక్స్‌ స్వాధీనం చేసుకొన్నారు.

Updated : 03 Jan 2024 14:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  జపాన్‌ (Japan)లోని టోక్యో హనెడా విమానాశ్రయంలో మంగళవారం జరిగిన పెను ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జపాన్‌ కోస్ట్‌గార్డ్‌ విమానం కెప్టెన్‌, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ భిన్నమైన కథనాలు చెబుతున్నారు. ‘రన్‌వే-సి’పై జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం దిగేందుకు ట్రాఫిక్‌ కంట్రోలర్‌ క్లియరెన్స్‌ ఇచ్చినట్లు దేశ రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో రన్‌వేకు దూరంగా ఉండాలని కోస్ట్‌గార్డ్‌ విమానానికి సూచించినట్లు తెలిపింది.

వేల భవనాలు, కార్లు ధ్వంసం

మరోవైపు కోస్ట్‌గార్డ్‌ వర్గాలు మాత్రం దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. తమ విమానం ఎగిరేందుకు కంట్రోలర్‌ నుంచి అనుమతి లభించినట్లు చెబుతున్నాయి. ఈ విమానం నీగట ప్రిఫిక్చెర్‌కు భూకంప సహాయ సామగ్రిని తరిలించేందుకు బయల్దేరాల్సి ఉంది. ఈ ప్రమాదంపై జపాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సేఫ్టీ బోర్డు (జేటీఎస్‌బీ) పూర్తి స్థాయి దర్యాప్తును బుధవారం ప్రారంభించింది. ఇప్పటికే దర్యాప్తు బృందం కోస్టుగార్డ్‌ విమానం బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకొంది. ఇక జపాన్‌ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ ఏ350 విమానం బ్లాక్‌బాక్స్‌ మాత్రం ఇంకా లభించలేదు. మరోవైపు దర్యాప్తునకు  సహకరించడానికి వీలుగా ఫ్రాన్స్‌ ప్రభుత్వం.. ఎయిర్‌ బస్‌ సంస్థ నిపుణులను జపాన్‌కు తరిలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

100 విమానాల రద్దు..

హనెడా ఎయిర్‌పోర్టులో విమాన ప్రమాదం కారణంగా దాదాపు 100కుపైగా విమానాలు రద్దయ్యాయి. ఆల్‌ నిప్పన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ దాదాపు 54 జాతీయ, అంతర్జాతీయ సర్వీసులను నిలిపివేసింది. జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ మరో 50 సర్వీసులను ఆపేసింది. దీంతో విమాన ప్రయాణికుల కోసం జపాన్‌ రైల్వే నాలుగు బుల్లెట్‌ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.

సపోరో నగరంలోని షిన్‌ చిటోస్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరిన జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏఎల్‌ 516 విమానం హనెడా విమానాశ్రయంలో దిగుతున్న (ల్యాండింగ్‌) సమయంలో కోస్టు గార్డు (తీర రక్షక దళం) విమానాన్ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. రెండు విమానాల్లో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది, అగ్నిమాపక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జేఏల్‌ విమానంలో ఉన్న 379మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో కోస్టుగార్డు విమానంలో ఉన్న అయిదుగురు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. పైలట్‌ ప్రాణాలతో బయటపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని