Biden: ‘మీ వల్లే ఎన్నో ప్రాణాలు నిలిచాయి’: నౌకలోని భారత సిబ్బందికి బెడైన్‌ ప్రశంసలు

నౌక ఢీ కొనడంతో వంతెన కుప్పకూలిన అనూహ్య ఘటన అమెరికా(USA)లో చోటుచేసుకుంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు.

Updated : 27 Mar 2024 12:17 IST

వాషింగ్టన్: నౌక ఢీకొనడంతో పటాప్‌స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ వంతెన కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అమెరికా (USA) అధ్యక్షుడు జో బైడెన్ (Biden) స్పందించారు. సహాయక సిబ్బంది, నౌకలో ఉన్న భారత సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు.

‘షిప్‌ తమ నియంత్రణ కోల్పోయిందని గుర్తించిన సిబ్బంది తక్షణమే స్పందించి, మేరీలాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీని అప్రమత్తం చేశారు. దాంతో స్థానిక అధికారులు వంతెనపై రాకపోకలను ఆపివేయగలిగారు. వారి అప్రమత్తత ఎన్నో ప్రాణాలను కాపాడింది’ అని బైడెన్ వెల్లడించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అత్యవసర పరిస్థితిలో అన్ని వనరులను అందుబాటులో ఉంచామన్నారు. తమ ప్రభుత్వం వంతెన పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

అమెరికా వంతెన ప్రమాదంలో నిలిచిపోయిన గాలింపు చర్యలు.. ఆరుగురి మృతి!

అమెరికా(USA)లోని బాల్టిమోర్‌లో ఈ భారీ ప్రమాదం జరిగింది. సింగపూర్‌ జెండాతో ‘డాలీ’ అనే నౌక బాల్టిమోర్‌ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నౌకను మెర్స్క్‌ షిప్పింగ్‌ కంపెనీ అద్దెకు తీసుకుంది. నౌకలోని మొత్తం 22 మంది సిబ్బంది భారతీయులేనని కంపెనీ వెల్లడించింది. వారెవరికీ గాయాలు కాలేదని తెలిపింది. 

స్పందించిన భారత ఎంబసీ

ఈ ఘటనపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌(ట్విటర్‌)లో స్పందించింది. ఈ దుర్ఘటన వల్ల ప్రభావితమైన భారతీయ పౌరుల సహాయార్థం ప్రత్యేక హాట్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని