Russia: రష్యా భూభాగంపై ఉక్రెయిన్‌ దాడి.. 14 మంది మృతి

సరిహద్దున ఉన్న తమ నగరం బెల్గొరోడ్‌లో ఉక్రెయిన్‌ దాడి జరిపినట్లు రష్యా పేర్కొంది. ఈఘటనలో 14 మంది మృతిచెందినట్లు తెలిపింది. 

Updated : 31 Dec 2023 01:44 IST

మాస్కో: రష్యా(Russia) భూభాగంలో శనివారం ఉక్రెయిన్‌(Ukraine) జరిపిన దాడుల్లో సుమారు 14 మంది మృతిచెందగా, 108 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌కు సరిహద్దున 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్గొరోడ్‌లో ఈ దాడి జరిగినట్లు రష్యా ప్రకటించింది. ఈ దాడి ఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పలు చిత్రాలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. దాడి ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలను రష్యా ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ విడుదల చేసింది. వీధుల్లో భవనాల శకలాలు, పొగ వ్యాపించి ఉన్నట్లు కనిపించాయి. ఇక మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండగా, గాయపడిన వారిలో 15 మంది చిన్నారులు ఉన్నట్లు రష్యా పేర్కొంది. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అధికారులు సమాచారం అందించారు. బెల్గొరోడ్‌ను కీవ్‌ దళాలు తరుచూ లక్ష్యంగా చేసుకొని విచక్షణ రహితంగా షెల్లింగ్‌ చేస్తున్నట్లు రష్యా పేర్కొంది. 
  
ఉక్రెయిన్‌పై రష్యా శుక్రవారం భారీ స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. సుమారు 122 క్షిపణులు, 36 డ్రోన్లతో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా ప్రధాన నగరాలపై రష్యా దాడి చేసింది. ఈ ఘటనలో సుమారు 39 మంది మృతిచెందగా, 144 మంది గాయపడ్డారు. పలు పాఠశాలలు, మెటర్నిటీ ఆసుపత్రులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లతో సహా పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. గత 22 నెలలుగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇదే అతిపెద్ద దాడి అని పలువురు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని