USA: హౌతీ దాడులను తిప్పికొట్టి.. 18 నౌకలను కాపాడి..!

వాణిజ్య నౌకలే లక్ష్యంగా ఎర్ర సముద్రంలో హౌతీలు ప్రయోగించిన ఓ యాంటీ-షిప్‌ బాలిస్టిక్‌ క్షిపణిని, డ్రోన్‌ను తమ యుద్ధనౌక కూల్చేసినట్లు అమెరికా ప్రకటించింది.

Published : 29 Dec 2023 15:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం (Israel Hamas Conflict) నేపథ్యంలో ఎర్ర సముద్రం (Red Sea)లో అంతర్జాతీయ రవాణా నౌకలపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు దాడులకు తెగబడుతున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్లు, క్షిపణులతో చేస్తున్న ఈ దాడులు జల రవాణాను దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి నౌకలపై దాడికి యత్నించగా.. దాన్ని తిప్పికొట్టినట్లు అమెరికా ప్రకటించింది. 

‘‘దక్షిణ ఎర్ర సముద్రంలో హౌతీలు ప్రయోగించిన ఓ డ్రోన్‌ను, యాంటీషిప్‌ బాలిస్టిక్‌ క్షిపణిని మా యుద్ధనౌక ‘యూఎస్‌ఎస్‌ మాసన్’ కూల్చేసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న 18 నౌకల్లో దేనికీ నష్టం వాటిల్లలేదు. సిబ్బంది ఎవరూ గాయపడలేదు’’ అని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ (CENTCOM) ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ వాణిజ్య నౌకలే లక్ష్యంగా అక్టోబర్ 19వ తేదీ నుంచి హౌతీలు ఇప్పటి వరకు 22 సార్లు నౌకలపై దాడులకు పాల్పడినట్లు వెల్లడించింది.

దాడులతో ‘ఎర్ర’బారుతున్న సముద్రం

మరోవైపు.. హౌతీ దాడులకు ఆర్థికంగా తోడ్పడుతున్న నెట్‌వర్క్‌పై ఆంక్షలు విధించినట్లు అమెరికా వెల్లడించింది. ఇరాన్‌ ఆదేశాల మేరకు హౌతీలకు లక్షలాది డాలర్లను బదిలీ చేయడంలో ఈ నెట్‌వర్క్‌ సాయపడినట్లు ఆరోపించింది. యెమెన్, తుర్కియేలోని మూడు నగదు మార్పిడి సంస్థలతోపాటు  సనాలోని ఓ ఆర్థిక సంస్థ అధిపతిని ఈ జాబితాలో చేర్చినట్లు తెలిపింది. రవాణా నౌకలకు రక్షణ కల్పించేందుకు ‘ఆపరేషన్‌ ప్రాస్పెరిటీ గార్డియన్‌’ను  అమెరికా మిత్రదేశాలు చేపట్టాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని