Dubai Rains: ఏడాదిన్నర వాన గంటల్లోనే.. ఎడారి దేశాన్ని వణికించిన మెరుపు వరద

Dubai Rains: దుబాయ్‌ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎయిర్‌పోర్టులో మోకాలి లోతు నీరు చేరి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.

Updated : 17 Apr 2024 11:02 IST

దుబాయ్‌: నిత్యం ఎండలతో మండిపోయే ఎడారి దేశం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో అకాల వర్షాలు (Heavy Rains) బీభత్సం సృష్టించాయి. మంగళవారం బలమైన గాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు నీటమునిగాయి. జనజీవనం స్తంభించింది. దుబాయ్‌ (Dubai)లో ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం.. కొన్ని గంటల్లోనే కురిసిందని అధికారులు తెలిపారు.

సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి దుబాయ్‌లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ధాటికి ప్రధాన రహదారిలో కొంత భాగం కొట్టుకుపోయింది. ఈ నగరంలో 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (Airport) రన్‌వేపైకి భారీగా నీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయారు. రన్‌వేపై మోకాలిలోతు నీటిలో విమానాలు ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

పత్రాల్లో పొరపాటు.. ఒక జంట బదులు మరొకరికి విడాకులు

ఎమిరేట్‌ ఆఫ్‌ ఫుజైరా.. నీరులేని పర్వత ప్రాంతాలు, రాతి నేలలు, మైదానాల మిశ్రమంతో ఉండే ఈ ప్రదేశం రాతి ఎడారిగా పేరొందింది. ఇక్కడ నిన్న 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బహ్రెయిన్‌, ఖతర్‌, సౌదీ అరేబియాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా గతంలో యూఏఈలో ఈ స్థాయి వర్షాలు చాలా అరుదు. అలాంటిది గత రెండు మూడు సంవత్సరాల్లో తరచూ ఇలా భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావారణ మార్పుల ప్రభావంతోనే ఈ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని