Saudi Arabia: మరో కీలక డీల్‌ దిశగా సౌదీ అరేబియా

అరబ్‌ ప్రపంచంలో మరో సయోధ్యకు రంగం సిద్ధమైంది. సిరియా-సౌదీ అరేబియా విభేదాల పరిష్కారం కోసం చర్చలు చేపట్టాయి.  

Published : 14 Apr 2023 01:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు మరో కీలక ఒప్పందానికి రంగం సిద్ధమైంది. దాదాపు పదేళ్లుగా విరోధులుగా ఉన్న సౌదీ అరేబియా(Saudi Arabia)-సిరియా(Syria) సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి చర్యలు చేపట్టాయి. ఇరు దేశాలు పరస్పరం దౌత్యకార్యాలయాల ఏర్పాటు, విమానాల రాకపోకల పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ మేరకు ఇరు దేశాలు ఏప్రిల్‌ 13వ తేదీన సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

2012 తర్వాత తొలిసారి సిరియా విదేశాంగ మంత్రి ఫైసల్‌ మిక్‌దాద్‌ సౌదీలో పర్యటిస్తున్న సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్‌ బిన్‌ ఫర్హాన్‌ అల్‌ సౌద్‌ ఆహ్వానం మేరకు మిక్‌దాద్‌ ఈ పర్యటనకు వచ్చారు. బుధవారం వీరి మధ్య ఇరు దేశాల ద్వైపాక్షి సంబంధాలపై చర్చ జరిగింది. సమగ్ర రాజకీయ పరిష్కారం కోసం ఈ చర్చలు జరిగినట్లు సౌదీ మీడియా వెల్లడించింది. ఈ చర్చలతో సయోధ్య  చోటు చేసుకొని సిరియా తిరిగి అరబిక్‌ ప్రపంచలోకి అడుపెడుతుందని ఈ సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఆశాభావం వ్యక్తమైంది.

గతంలో సిరియాలో ఉద్యమకారులను అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ నేతృత్వంలో దళాలు అణచివేతకు పాల్పడ్డాయి. దీంతో ప్రజలు మరింత ఎదురుతిరగడంతో అది  తిరుగుబాటుకు దారితీసింది. దీంతో 2011లో సివిల్‌ వార్‌ మొదలైంది. ఫలితంగా మెల్లగా అరబ్‌ దేశాలు సిరియాకు దూరం జరిగాయి. ఇటీవల కాలంలో ఆ దేశ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ మళ్లీ దేశంలోని అన్ని ప్రాంతాలపై పట్టుసాధించడం మొదలుపెట్టారు. దీంతో అరబ్‌ దేశాలు కూడా మెల్లగా సయోధ్యకు ప్రయత్నాలు చేపట్టాయి. ఫిబ్రవరి 6వ తేదీన తుర్కియే, సిరియాలో భారీ భూకంపం వచ్చింది. ఆ సమయంలో ఇరుగుపొరుగు దేశాలతో సిరియా సంబంధాలు బలపడ్డాయి. మరోవైపు సౌదీ అరేబియా కూడా చుట్టుపక్కల దేశాలతో తన వివాదలను తగ్గించుకొంటోంది. ఈ క్రమంలో చైనా మధ్యవర్తిత్వంతో ఇటీవల ఇరాన్‌-సౌదీ మధ్య సంబంధాల పునరుద్ధరణకు ఒప్పందం కుదిరింది. వాస్తవానికి సిరియా సంక్షోభంలో ఇరాన్‌, సౌదీలు పరస్పరం వ్యతిరేకంగా పనిచేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని