Lahore Declaration: ‘లాహోర్‌ ఒప్పందం’పై నవాజ్‌ వ్యాఖ్యలు.. భారత్‌ స్పందన ఏంటంటే!

‘లాహోర్‌ డిక్లరేషన్‌’ ఉల్లంఘన వ్యవహారంలో పాకిస్థాన్‌ నుంచి నిష్పాక్షిక ధోరణి కనిపిస్తోందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

Published : 31 May 2024 00:22 IST

దిల్లీ: భారత్‌తో కుదుర్చుకున్న ‘లాహోర్‌ డిక్లరేషన్‌ (Lahore Declaration)’ను పాకిస్థాన్‌ (Pakistan) ఉల్లంఘించిందంటూ ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ ఇటీవల అంగీకరించిన విషయం తెలిసిందే. దీనిపై భారత విదేశాంగ శాఖ (MEA) స్పందించింది. పొరుగుదేశం నుంచి ఈ వ్యవహారంపై నిష్పాక్షిక ధోరణి కనిపిస్తోందని పేర్కొంది.

అణ్వాయుధాల వాడకం నివారణ, రెండు దేశాల మధ్య శాంతి, స్థిరత్వంపై 1999 ఫిబ్రవరిలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీనిపై అప్పటి భారత్‌, పాక్‌ ప్రధానులు అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, నవాజ్‌ షరీఫ్‌లు సంతకం చేశారు. అయితే, తాము ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించామని, అది ముమ్మాటికీ తప్పేనని నవాజ్‌ షరీఫ్‌ ఇటీవల పేర్కొన్నారు. అప్పటి సైనిక జనరల్ పర్వేజ్ ముషారఫ్ దుస్సాహసానికి ఒడిగట్టడం వల్లనే కార్గిల్ యుద్ధం జరిగినట్లు చెప్పారు. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ స్పందిస్తూ.. ‘‘ఈ విషయంలో భారత్‌ వైఖరేంటో అందరికీ తెలుసు. దాన్ని పునరుద్ఘాటించాల్సిన అవసరం లేదు. దీనిపై పాకిస్థాన్‌లోనూ నిష్పాక్షిక దృక్పథం ఏర్పడినట్లు గమనించాం’’ అని తెలిపారు.

ఎల్వోసీ వెంబడి చైనా రక్షణ నిర్మాణాలు

మరోవైపు.. మాల్దీవులతో ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ విషయమై ప్రతిపాదనలేవీ లేవని, ఒకవేళ ఆ దేశం ఆసక్తి కనబరిస్తే మాత్రం పరిగణనలోకి తీసుకుంటామని జైశ్వాల్‌ చెప్పారు. ఇరుదేశాల మధ్య ఎఫ్‌టీఏ కుదుర్చుకునేందుకు భారత్‌ ప్రయత్నాలు ప్రారంభించిందని ఇటీవల మాల్దీవుల మంత్రి మహ్మద్ సయీద్ వ్యాఖ్యానించిన వేళ ఆయన ఈమేరకు స్పష్టత ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని