Jerusalem: జెరూసలెంలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి..!

ఓ పక్క హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ పొడిగించిన వేళ జెరూసలెంలో ఉగ్రదాడి చోటు చేసుకొంది. బస్టాప్‌లో ఉన్న ప్రజలపై ఇద్దరు సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 

Updated : 30 Nov 2023 21:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణను పొడిగించిన వేళ.. జెరూసలెంలో నేటి ఉదయం ఉగ్రదాడి చోటుచేసుకొంది. గురువారం 7.40 సమయంలో కారులో వచ్చిన ఇద్దరు పాలస్తీనా సాయుధులు జెరూసలెంలోని వైజ్‌మన్‌ స్ట్రీట్‌లో ఓ బస్టాప్‌లో నిలిచిన ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దాడి సమయంలో.. విధులు ముగించుకొని వెళుతున్న ఇద్దరు సైనికులు, ఆయుధం ఉన్న ఓ పౌరుడు ఈ ఉగ్రవాదులపై ఎదురుదాడికి దిగారు. ఆ ఇద్దరు ఉగ్రవాదులు కూడా మరణించారు. వీరిద్దరిని తూర్పు జెరూసలెంకు చెందిన మురాద్‌ నమార్‌, ఇబ్రహీం నమార్‌గా గుర్తించారు.  వీరి నుంచి ఎం-16 రైఫిల్‌, హ్యాండ్‌ గన్‌ స్వాధీనం చేసుకోగా.. వాహనంలో భారీగా మందుగుండు సామగ్రి ఉన్నట్లు గుర్తించారు. 

పన్నూ హత్య కుట్ర కేసు.. భారత వ్యక్తిపై అమెరికా అభియోగాలు

అంతర్గత నిఘా సంస్థ షిన్‌బెట్‌ సెక్యూరిటీ ఏజెన్సీ కథనం ప్రకారం వీరు గతంలో హమాస్‌ సభ్యులుగా పనిచేసినట్లు తేలింది. మురాద్‌ అనే వ్యక్తి 2010 నుంచి 2020 వరకు ఉగ్ర కుట్ర కేసులో జైలు జీవితం గడిపాడు. 2014లో ఇబ్రహీం కూడా జైలుకు వెళ్లాడు. ఏడాది క్రితం ఇదే ప్రదేశంలో బాంబు దాడి జరిగింది.

అక్టోబర్‌ 7వ తేదీన హమాస్‌ చేసిన దాడితో ఇజ్రాయెల్‌-వెస్ట్‌బ్యాంక్‌ మధ్య కూడా తీవ్ర ఉద్రిక్తతలు మొదలయ్యాయి. గాజా నుంచి నాడు దాదాపు 3,000 మంది హమాస్‌ సభ్యులు ఇజ్రాయెల్‌లోకి దూసుకెళ్లి 1,200 మందిని హత్య చేశారు. దాదాపు 240 మంది బందీలుగా పట్టుకొన్నారు. దీంతో హమాస్‌ను నామరూపాల్లేకుండా చేసేందుకు ఇజ్రాయెల్‌ గ్రౌండ్‌ ఆపరేషన్‌ను మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్‌లో కొన్ని వేల మంది గాజా వాసులు మరణించగా.. వందల కొద్దీ హమాస్‌ సొరంగాలను ఇజ్రాయెల్‌ ధ్వంసం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని