Ceasefire: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలి.. మొదటిసారి ‘యూఎన్‌ఎస్‌సీ’ డిమాండ్‌

గాజాలో పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని ఐరాస భద్రతా మండలి డిమాండ్‌ చేసింది.

Published : 26 Mar 2024 00:04 IST

ఐరాస: ఇజ్రాయెల్‌ (Israel) దాడులతో అతలాకుతలమైన గాజా (Gaza)లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని ఐరాస భద్రతా మండలి (UNSC) డిమాండ్‌ చేసింది. అదే విధంగా అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన సమయంలో బందీలుగా తీసుకెళ్లిన వారందరినీ హమాస్‌ విడిచిపెట్టాలని పేర్కొంది. గతేడాది అక్టోబరు 7న హమాస్‌- ఇజ్రాయెల్‌ యుద్ధం (Israel Hamas War) మొదలు యూఎన్‌ఎస్‌సీ నుంచి ఈమేరకు పిలుపు రావడం ఇదే మొదటిసారి.

ఉపన్యాసాలొద్దు.. మీ ఉగ్ర ఫ్యాక్టరీలను మూసేయండి: పాక్‌ను ఎండగట్టిన భారత్‌

15 మంది సభ్యదేశాలు కలిగిన భద్రతా మండలిలో సోమవారం ఈమేరకు ప్రవేశపెట్టిన తీర్మానానికి 14 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా.. శాశ్వత సభ్యదేశమైన అమెరికా దూరంగా ఉంది. మొదటి నుంచి ఇజ్రాయెల్‌కు అండగా ఉన్న అగ్రరాజ్యం.. ఈసారి ఓటింగ్‌ సమయంలో తన వీటో అధికారాన్ని వినియోగించుకోలేదు. దీంతో 14-0 తేడాతో సంబంధిత తీర్మానం నెగ్గింది. అయితే, ఇందులో కాల్పుల విరమణకు.. బందీల విడుదల షరతు విధించలేదు.

నెతన్యాహు నిరసన.. అమెరికా పర్యటన రద్దు

గాజాలో తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిస్తూ భద్రతా మండలి తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. గాజాలో కాల్పుల విరమణకు బందీల విడుదల షరతు విధించకుండా తీర్మానం ఆమోదం పొందేలా చేసి.. ఆ దేశం తన వైఖరి నుంచి పక్కకు జరిగిందని నెతన్యాహు విమర్శించారు.

గాజాలో 10 లక్షలకుపైగా పౌరులు ప్రస్తుతం రఫాలో తలదాచుకుంటున్నారు. వారిని కాపాడేందుకు సరైన ప్రణాళిక లేకుండా ఇక్కడ సైనిక చర్యకు దిగొద్దని ఇజ్రాయెల్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవల హెచ్చరించారు. దీంతో రఫాలో భూతల దాడులకు సంబంధించిన ప్రణాళికలను వైట్‌హౌస్‌కు అందించేందుకు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో అగ్రరాజ్యానికి వెళ్లేందుకు నెతన్యాహు సిద్ధమయ్యారు. తాజా పరిణామంతో రద్దు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని