Pannun: పన్నూను నోఫ్లై జాబితాలో చేర్చండి.. : డిమాండ్‌ చేసిన ప్రవాస భారతీయులు

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూపై చర్యలు తీసుకోవాలని భారత సంతతి వాసులు కెనడా ప్రభుత్వాన్ని కోరారు. మరో వైపు కెనడా ఎంపీ చంద్ర ఆర్యా కూడా ఈమేరకు ట్రూడోకు విజ్ఞప్తి చేశారు.  

Published : 21 Nov 2023 15:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎయిర్‌ ఇండియా ప్రయాణికులను బెదిరిస్తూ వీడియో సందేశం జారీ చేసిన ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూను, సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థను నోఫ్లై జాబితాలో చేర్చాలని అమెరికాలోని భారత సంతతి ప్యానెల్‌ డిమాండ్‌ చేసింది. ది ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా అండ్‌ ఇండియన్‌ డయాస్‌పోరా స్టడీస్‌ (FIIDS) సంస్థ ఈ చర్చాకార్యక్రమం నిర్వహించింది. సిక్కు వేర్పాటువాద నాయకుడిపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఈ గ్రూపులో ఇండో-అమెరికన్లు, ఇండో-కెనడా వాసులు అభిప్రాయపడ్డారు. 

రన్‌వే నుంచి అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం..!

‘‘కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఉగ్రవాదుల స్వేచ్ఛను భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అంటూ వక్రీకరిస్తున్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్యలో భారత్‌ ప్రమేయం ఉందంటూ ట్రూడో చేసిన బహిరంగ వ్యాఖ్యలు కెనడాలో భారత, హిందూ వ్యతిరేక హింసను ప్రేరేపించాయి. ట్రూడో పాలసీలు తీవ్రవాదుల బెదిరింపులను నిర్లక్ష్యం చేస్తుండటంతో.. అవి కెనడాకు ముప్పుగా మారతాయి’’ అని ఎఫ్‌ఐఐడీఎస్‌ నాయకుడు ఖండేరావు కండా హెచ్చరించారు.

కనిష్కా పేలుడు ప్రస్తావిస్తూ.. ఎయిర్‌ ఇండియా విమాన ప్రయాణికులను బెదిరించిన పన్నూను నోఫ్లై లిస్టులో ఎందుకు చేర్చలేదని ఈ కార్యక్రమంలోని ప్యానలిస్టులు ప్రశ్నించారని ఖండేరావు ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు పలువురు అమెరికా, కెనడా వాసులు పన్నూపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అమెరికా కేంద్రంగా నడుస్తున్న ఎస్‌ఎఫ్‌జేపై ఇప్పటికే భారత్‌లో యూఏపీఏ చట్టం కింద నిషేధం విధించిన విషయం తెలిసిందే. 

ఆలయాన్ని రక్షించండి.. : ట్రూడోకు కెనడా ఎంపీ విజ్ఞప్తి

కెనాడాలోని సర్రేలో ఉన్న లక్ష్మీనారాయణ్‌ ఆలయం వద్ద నవంబర్‌ 26వ తేదీన ఆందోళనలు నిర్వహిస్తామని ఖలిస్థానీ గ్రూపులు హెచ్చరించడంపై ఆ దేశ ఎంపీ చంద్ర ఆర్య స్పందించారు. దేశంలో హిందువులపై తరచూ జరుగుతున్న విద్వేషపూరిత దాడులపై చర్యలు తీసుకోవాలని ప్రధాని ట్రూడోను కోరారు. ‘‘కొన్ని వార్తల ప్రకారం ఓ సిక్కు కుటుంబాన్ని బ్రిటిష్‌ కొలంబియాలోని ఓ గురుద్వారా వద్ద కొందరు ఖలిస్థానీలు ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అదే ఖలిస్థానీ గ్రూపు సర్రేలోని లక్ష్మీనారాయణ్‌ ఆలయం వద్ద సమస్యలు సృష్టించడానికి సిద్ధమైంది. ఇది మొత్తం భావవ్యక్తీకరణ స్వేచ్ఛపేరిట జరుగుతోంది. అధికారులు తక్షణమే రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాలని నేను ఎప్పటి వలే కోరుతున్నాను. గత కొన్నేళ్లలో హిందు ఆలయాలపై పలుమార్లు దాడులు జరిగాయి. ఇలాంటివి బహిరంగంగా జరుగుతున్నా చూస్తూ ఊరుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని ఎక్స్‌ (ట్విటర్‌)లో పేర్కొన్నారు. జూన్‌ నెలలో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య తర్వాత భారత్‌-కెనడా సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికాకు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ భారతీయులను బెదిరిస్తూ వీడియో జారీ చేశాడు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని