White House: మా క్లస్టర్‌ ఆయుధాలు రష్యాపై వాడుతున్నారు..: శ్వేతసౌధం

ఉక్రెయిన్‌ దళాలు క్లస్టర్‌ ఆయుధాలు వాడుతున్నట్లు అమెరికా అధ్యక్ష భవనమైన శ్వేతసౌధం అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు రష్యా.. ఉక్రెయిన్‌ పోర్ట్‌ సిటీ ఒడెస్సాపై క్షిపణులతో విరుచుకుపడుతోంది.

Updated : 21 Jul 2023 12:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తాము సరఫరా చేసిన క్లస్టర్‌ ఆయుధాలను ఉక్రెయిన్‌ (Ukraine ) సేనలు.. రష్యా దళాలపై వాడుతున్నాయని అమెరికాలోని శ్వేత సౌధం (White House) ధ్రువీకరించింది. నేషనల్‌ సెక్యూరిటీ ప్రతినిధి జాన్‌ కిర్బి మాట్లాడుతూ రష్యా సైన్యం స్థావరాలు, ఆపరేషన్లపై ఇవి చాలా ప్రభావం చూపుతున్నాయని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌కు చెందిన ఒడెస్సా పోర్టు తదితర కీలక ప్రాంతాలపై రష్యా ఎడతెరిపి లేకుండా క్షిపణి దాడులు చేస్తోంది. దీంతో 19 మంది గాయపడ్డారు. ఫలితంగా ఉక్రెయిన్‌ దళాలు క్లస్టర్‌ ఆయుధాల వినియోగం ప్రాంభించాయి.

జులై 8వ తేదీన క్లస్టర్‌ ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. వారం తర్వాత వాటిని కీవ్‌కు చేర్చింది. అమెరికా పంపిన వాటిల్లో ఎం864, ఎం483ఎ1 క్లస్టర్‌ ఆయుధాలున్నాయి. వీటిల్లో డడ్‌రేటు 2.35శాతం కంటే తక్కువగా ఉంటుంది. ఈ రకం ఆయుధ సరఫరాతో ఉక్రెయిన్‌కు మందుగుండు కొరత కూడా తీరుతుంది.

చైనాలో అమెరికా పెద్దాయన ఏం చేస్తున్నట్లు?

అమెరికా, ఐరోపా సమాఖ్యలు సంప్రదాయ ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఈ కొరత తీర్చేందుకు ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. తాజాగా తాము ఇచ్చిన క్లస్టర్‌ ఆయుధాలను ప్రజలు నివసించే ప్రాంతాల్లో వాడమని ఉక్రెయిన్‌ వద్ద మాటతీసుకొన్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ పేర్కొన్నారు. 

మరో వైపు క్లస్టర్‌ ఆయుధ సరఫరాపై గత వారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పందిస్తూ.. తమ వద్ద కూడా తగినన్ని క్లస్టర్‌ ఆయుధాలున్నాయని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఒక వేళ ఉక్రెయిన్‌ ఇటువంటి ఆయుధాలు వాడితే.. తాము కూడా వాడతామని తేల్చిచెప్పారు. అయితే.. మార్చిలో ఐరాస వెలువరించిన ఓ నివేదికలో ఇప్పటికే రష్యా 24 సార్లు క్లస్టర్‌ ఆయుధాలు వాడినట్లు ఓ నివేదికలో పేర్కొంది. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరంపైనే కనీసం 11 క్లస్టర్‌ రాకెట్లను ప్రయోగించినట్లు తెలిపింది.

ఉక్రెయిన్‌పై నాలుగు రోజుల్లో 70 క్షిపణులు..

క్రిమియా-రష్యాను కలిపే కెర్చ్‌ వంతెనపై దాడి అనంతరం ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. నాలుగు రోజుల్లో 70 క్షిపణులు, 90 షహీద్‌ డ్రోన్లను ప్రయోగించి ఉక్రెయిన్‌ ఓడరేవు నగరమైన ఒడెస్సాలో విధ్వంసం సృష్టించింది. మరో వైపు రష్యా ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో చాలా వరకు తమ సైన్యం కూల్చేసిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. కాకపోతే మొత్తం ఉక్రెయిన్‌ను కాపాడుకోవడానికి తమ శక్తి సరిపోదని ఆయన పేర్కొన్నారు. తమ భాగస్వాముల నుంచి అదనపు రక్షణ పరికరాలు పొందడంపై చర్చిస్తున్నట్లు  వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు