Russia: ఉక్రెయిన్‌ పైచేయి సాధిస్తే.. అణ్వాయుధ ప్రయోగం తప్పదు!

నాటో (NATO) మద్దతుతో చేస్తోన్న ఎదురు దాడుల్లో ఉక్రెయిన్‌ విజయం సాధిస్తే.. అణ్వాయుధ ప్రయోగం చేయక తప్పని పరిస్థితులు ఎదురవుతాయని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌ పేర్కొన్నారు.

Published : 31 Jul 2023 02:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏడాదిన్నరగా ఉక్రెయిన్‌పై దురాక్రమణకు (Russia Invasion) పాల్పడుతోన్న రష్యాపై ప్రపంచ దేశాలు ఎంత ఒత్తిడి తెచ్చినా వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలో నాటో (NATO) మద్దతుతో తమపై కొనసాగుతోన్న ఎదురు దాడుల్లో ఉక్రెయిన్‌ పైచేయి సాధించినట్లయితే.. కీవ్‌పై అణ్వాయుధ ప్రయోగం చేయక తప్పని పరిస్థితులు ఎదురవుతాయని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌ పేర్కొన్నారు.

‘ఒకవేళ.. నాటో మద్దతుతో ఉక్రెయిన్‌ చేస్తోన్న ఎదురు దాడులు విజయవంతమై మా భూభాగాన్ని ఆక్రమించుకుంటాయని భావిస్తే.. మేం అణ్వాయుధం వినియోగించక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. అటువంటి సమయాల్లో మాకు మరో అవకాశం ఉండదు. అందుకే మేం విజయం సాధించాలని మా శత్రువులు (ఉక్రెయిన్‌) కోరుకోవాలి. అణ్వాయుధం పేలకుండా ఉండటం వారి చేతుల్లోనే ఉంది’ అని తన అధికారిక సోషల్‌ మీడియాలో దిమిత్రి మెద్వెదేవ్‌ వెల్లడించారు. రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న ఆయన.. అటువంటి పరిస్థితులే ఎదురైతే అణ్వాయుధ వినియోగంపై రష్యా తన సొంత నిర్ణయంపైనే వెనక్కి తగ్గాల్సి వస్తుందన్నారు.

అమెరికా సైనిక పరికరాల్లో చైనా వైరస్‌ ‘టైంబాంబ్‌’..!

ఉక్రెయిన్‌పై చేస్తోన్న దురాక్రమణలో కొన్ని ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోన్న ఉక్రెయిన్‌.. పాశ్చాత్య దేశాల మద్దతుతో రష్యాపై ఎదురు దాడులకు ఉపక్రమించింది. ఈ క్రమంలో నాటో దేశాలు జెలెన్‌స్కీ సేనలకు ఆర్థిక, ఆయుధ సహకారాన్ని అందిస్తున్నాయి. ఇలా అత్యాధునిక ఆయుధాలతో పోరాడుతున్న నేపథ్యంలో అణ్వాయుధ ప్రయోగంపై దిమిత్రి మెద్వెదేవ్‌ పరోక్ష హెచ్చరికలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని