Blue Whale Challenge: భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్‌..!

ప్రమాదకర టాస్క్‌లతో యువతను ఆత్మహత్యకు ప్రేరేపిస్తుందనే విమర్శలున్న బ్లూవేల్ ఛాలెంజ్ (Blue Whale Challenge) మరోసారి చర్చనీయాంశంగా మారింది. 

Updated : 20 Apr 2024 15:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్రరాజ్యం అమెరికా (USA)లో చదువుకుంటున్న భారతీయ, భారత సంతతి విద్యార్థులు (Indian Origin Students) వరుసగా ప్రాణాలు కోల్పోతుండటం కలకలం రేపుతోంది. మసాచుసెట్స్‌ యూనివర్సిటీకి చెందిన భారత విద్యార్థి గత నెల ప్రారంభంలో శవమై కనిపించాడు. ఆ ఆత్మహత్యకు ‘బ్లూవేల్ ఛాలెంజ్’(Blue Whale Challenge) అనే గేమ్ కారణమని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనిని ఆత్మహత్య కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు. ఒక గేమ్ కారణంగా అతడు మృతి చెంది ఉంటాడా? అని ప్రశ్నించగా.. ‘‘దానిపై మాకు ఎలాంటి సమాచారం లేదు. ఈ కేసును మూసివేయడానికి ముందు వైద్య పరీక్షల తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం’’ అని చెప్పారు. చనిపోవడానికి ముందు ఆ విద్యార్థి రెండు నిమిషాల పాటు ఊపిరి బిగపట్టినట్లు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ మీడియా పేర్కొంది. ఈ తరుణంలో ఈ సూసైడ్‌ గేమ్ గురించి మరోసారి చర్చ మొదలైంది.

అసలేంటీ బ్లూవేల్‌ ఛాలెంజ్‌..?

మొదట రష్యాలో మొదలైన ఈ ఆన్‌లైన్‌ గేమ్‌.. చివరకు అది ఆటగాళ్లను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది. దీనివల్ల పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు గతంలో కథనాలు వెలువడ్డాయి. కానీ ఆ కేసులు అధికారిక ధ్రువీకరణకు నోచుకోలేదు. దాంతో అనుమానిత బ్లూవేల్‌కు సంబంధించిన నెట్‌వర్క్‌లను పలు దేశాలు మూసివేశాయి. ఇక, ఈ గేమ్‌లో సుమారు 50 రోజుల పాటు ఒక క్యూరేటర్‌ ఆటగాళ్లకు పలు ప్రమాదకర టాస్క్‌లను ఇస్తుంటాడు. అందులో మొదటి టాస్క్‌ల్లో భాగంగా మధ్య రాత్రిలో నిద్ర లేవడం, భయానక దృశ్యాలు వీక్షించడం వంటివి ఉండొచ్చు.

సైబర్‌ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం

ఆ తర్వాత ఆ టాస్క్‌ల తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఎత్తైన టవర్ల అంచున నిల్చోవడం, చేతులపై గాయాలు చేసుకోవడం.. చివరిగా ఆటగాళ్లను ప్రాణాలు తీసుకోమని అడగొచ్చు. ఒకసారి ఈ గేమ్‌లోకి ఎంటర్‌ అయిన తర్వాత బయటపడటం దాదాపు అసాధ్యం. బెదిరించి, మానసికంగా తప్పుదోవ పట్టించి టాస్క్‌లు పూర్తిచేసేలా చూస్తుంటారు. ఉద్దేశపూర్వకంగా నీటి నుంచి బీచ్‌కు వచ్చి, ప్రాణాలు తీసుకునే బ్లూవేల్ ప్రవర్తన ఆధారంగానే ఈ గేమ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. 2015 చివర్లో రష్యా టీనేజర్‌ ఆత్మహత్యతో ఇది ప్రచారంలోకి వచ్చింది. 

తల్లిదండ్రులూ ఓ కంట కనిపెట్టండి..!

బ్లూవేల్‌ ఛాలెంజ్‌ కొత్తదేమీ కాదు. ఐదారేళ్ల క్రితం కూడా దీని గురించి పెద్దఎత్తున చర్చ జరిగింది. తాజాగా అమెరికాలోని మరణాలతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఒక్క బ్లూవేల్‌ అనే కాదు. ఇలాంటి కొత్త కొత్త ఛాలెంజులు నెట్టింట ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తుంటాయి. ముఖ్యంగా టీనేజీలో ఉన్న వారు వీటికి బాధితులవుతున్నారు. యువతను ఇలాంటి ఛాలెంజులకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ వినియోగంపై నిత్యం కన్నేసి ఉంచాలి. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో వారు ఎలాంటి పోస్టులను షేర్‌ చేస్తున్నారో పరిశీలిస్తూ ఉండాలి. వాళ్ల మనసులోని భావాలను స్వతంత్రంగా మీతో పంచుకోగలిగే స్వేచ్ఛనివ్వాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. దూరంగా కూర్చొని ఏడవడం, బాధపడటం లాంటివి చేస్తుంటే వాళ్లతో మాట్లాడి విషయం తెలుసుకోవాలని సూచిస్తున్నారు. పిల్లలతో ప్రేమగా మెలగడం ద్వారా ఇలాంటి బారిన పడకుండా చూడొచ్చని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని