వద్దనుకున్నా తప్పడంలేదు: KCR
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వద్దనుకున్నా తప్పడంలేదు: KCR

10 రోజులు చూసి పునరాలోచిద్దాం  
లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌
ధాన్యం కొనుగోళ్లపై రైతులకు ప్రజాప్రతినిధులు భరోసా కల్పించాలి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి వర్గాల జీవనోసాధి, వలస కూలీల ఇబ్బందులు, ఆర్థికావసరాల దృష్ట్యా లాక్‌డౌన్‌ పెట్టకూడదని భావించినా.. హైకోర్టు సూచనల్విడం, పలు వర్గాలు కోరడం, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే కరోనా రోగుల సమస్య తీవ్రం కావడంతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించక తప్పలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ నెల 20 వరకు పరిస్థితులను సమీక్షించి దీనిపై పునరాలోచన చేస్తామని మంత్రిమండలి సమావేశంలో ఆయన అన్నట్లు తెలిసింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కాగానే హైకోర్టు లాక్‌డౌన్‌పై స్పష్టతను కోరుతున్నట్లు అడ్వకేట్‌ జనరల్‌ నుంచి సమాచారం రావడంతో మంత్రిమండలిలో ముందుగా దానిపై తీర్మానం చేసి, హైకోర్టుకు పంపించారు. అనంతరం సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ‘‘ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా నియంత్రణలోనే ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులలో పడకలు, ఔషధాలు, ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ కొరత రాకుండా చూస్తున్నాం. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు పెద్దఎత్తున జరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గి, ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతాయని భావించాం. ఇతర రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించాక మన రాష్ట్రంపై ఒత్తిడి పెరిగింది. ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి రోగులు తెలంగాణకు తరలివస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు చివరి క్షణాల్లో రోగులను ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిస్తున్నాయి. వారు చనిపోతే ప్రభుత్వ ఆసుపత్రులు బద్‌నామ్‌ అవుతున్నాయి. ఎవరినీ కాదనకుండా చికిత్స ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ పార్టీలు, పలు సంఘాలు సైతం లాక్‌డౌన్‌ కోరుతున్నాయి. హైకోర్టు పదేపదే సూచనలు చేసింది. దీంతో కీలక రంగాలను మినహాయించి లాక్‌డౌన్‌ పెట్టాం. ప్రజలు సహకరించాలి. జన సంచారం తగ్గితే కరోనా ప్రభావం తగ్గుతుంది. ఆర్థికవ్యవస్థ కొంత దెబ్బతిన్నా.. ప్రజారోగ్యం దృష్ట్యా తప్పడంలేదు.

జిల్లాకు 10,000 రెమ్‌డెసివిర్లు
రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లకు డిమాండు దృష్ట్యా ఉమ్మడి జిల్లాకు పదివేల చొప్పున పంపిణీ చేస్తున్నాం. అవసరమైతే మరో అయిదారు వేలు ఇస్తాం. ఆక్సిజన్‌కు లోటు లేదు. పెద్దఎత్తున ఉత్పత్తి ప్రారంభిస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాం. వరంగల్‌, ఆదిలాబాద్‌లో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల రాకవల్ల 500 పడకలు, అత్యుత్తమ సేవలు అందుబాటులోకి వస్తాయి. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారి సంఖ్య కొంత తగ్గుతుంది.

ధాన్యం సంగతి చూడండి  
ధాన్యం కొనుగోళ్ల అంశం కూడా చాలా కీలకమైంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజాప్రతినిధులు చూడాలి. ప్రభుత్వమే మొత్తం బాధ్యత తీసుకున్నా అనుకున్నవి సకాలంలో కాకపోతే కొంత జాప్యం జరుగుతుంది. వాస్తవ పరిస్థితులను రైతులకు తెలియజెప్పి భరోసా కల్పించాలి. మిల్లర్ల సహకారం తీసుకోవాలి’’ అని సీఎం సూచించారు.

మీ జిల్లాకు మీరే వైద్యమంత్రి..
కరోనా నియంత్రణకు మంత్రులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కేసీఆర్‌ సూచించారు.  ‘‘వైద్య సేవలు ప్రజలకు అందడంలో మంత్రులు కీలకపాత్ర పోషించాలి. మీ జిల్లాకు మీరే వైద్యమంత్రి. జిల్లాలో ఆసుపత్రులను గమనించి మౌలిక సౌకర్యాల కల్పనకు చొరవ చూపాలి. కరోనా చికిత్సలో లోటుపాట్లను చక్కదిద్దాలి. నా శాఖ కాదు అనే భావనే వద్దు. ప్రతిరోజు సమీక్ష నిర్వహించి, కలెక్టర్లు, జిల్లా అధికారులకు ఆదేశాలివ్వాలి. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు స్పందించాలి. ఎవరు ఏ సాయం కోరినా మంత్రులు, ప్రజాప్రతినిధులు చేయాలి. అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేయాలి. ప్రధానంగా సరిహద్దు జిల్లాలు, మారుమూల ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి’’ అని సూచించారు.

కరోనాను ధైర్యంగా ఎదుర్కొన్నా..  
ఈనాడు, హైదరాబాద్‌: ‘కరోనాపై అప్రమత్తంగా ఉండాలి. నేను ఎంతో జాగ్రత్తగా ఉన్నా కరోనా రావడం విస్మయం కలిగించింది. అయినా దానిని ధైర్యంగా ఎదుర్కొన్నాను. ప్రజలకు అన్ని జాగ్రత్తలు తెలియజెప్పాలి’ అని సీఎం కేసీఆర్‌ మంత్రివర్గ సమావేశంలో సహచరులకు తెలిపారు. తెలంగాణకు అన్ని అంశాల్లో లాగే కరోనా నివారణ చర్యలకు కేంద్రం నుంచి సరైన సహకారం లభించడం లేదని అన్నారు. టీకాలు, ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ వంటి వాటిలో రాష్ట్రావసరాలను తీర్చడం లేదని చెప్పారు. కరోనా టీకాల వల్ల రోగులకు కొంత భరోసా కలుగుతోందన్నారు. కేంద్రం జనాభా అంతటికీ టీకాలు వేయిస్తే వారిలోనూ నమ్మకం కలిగేది. ఇకనైనా కేంద్రం టీకాలపై దృష్టి సారించాలని కోరారు.

హాజరైన మంత్రి కేటీఆర్‌
కరోనా బారిన పడి కోలుకున్న మంత్రి కేటీఆర్‌ మంగళవారం జరిగిన మంత్రిమండలి సమావేశానికి హాజరయ్యారు. ఆయనను ఔషధాలు, టీకాలపై రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌గా సీఎం నియమించారు. తాజాగా కొవిడ్‌ సోకిన ఎస్సీ, మైనారిటీ సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సమావేశానికి హాజరు కాలేదు. స్వల్ప శస్త్రచికిత్స కారణంగా తలసాని సైతం రాలేదు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని