
వార్తలు / కథనాలు
ఇంటర్నెట్ డెస్క్: భారతీయులు ఆవును తల్లిలా భావించి పూజిస్తుంటారు. గోమాత ఇంట్లో ఉన్నా.. గోశాలకు వెళ్లి వాటిని పూజించినా సుఖ శాంతులు దక్కుతాయని నమ్ముతారు. అయితే ఆధునిక కాలంలో వీటిని చాలా మంది కొట్టిపారేస్తుంటారు. ఆవును కేవలం పాలిచ్చే జంతువుగానే పరిగణిస్తారు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఆవుల వల్ల మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందని పరిశోధకులు చెబుతుండటమే ఇందుకు కారణం. దీంతో ప్రస్తుతం ఆవులను ఆలింగనం చేసుకోవడానికి ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ‘కౌ హగ్గింగ్’ థెరపీ ట్రెండ్ అవుతోంది.
నెదర్లాండ్‌లోని రీవర్ ప్రాంతంలో ఈ కౌ హగ్గింగ్ ప్రారంభమైంది. జోస్ వన్ స్ట్రాలెన్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా వ్యవసాయక్షేత్రంలో ఆవులను పెంచుతున్నాడు. అయితే ఈ ఆవులను ఆలింగనం చేసుకోవడం ద్వారా మనిషిలో ఒత్తిడి తగ్గుతుందని, సానుకూలత దృక్పథం పెరుగుతుందని చెబుతూ ఆవు ఆలింగనం పట్ల అవగాహన పెంచాడు. తన వ్యవసాయ క్షేత్రంలోనే వెల్నెస్ సెంటర్ పెట్టి.. ఆవులను ఆలింగనం చేసుకునేందుకు ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. ‘‘ఆవుల శరీర కదలికను మనం గమనించొచ్చు. ఆవు సగం కళ్లు మూసుకోవడం, చెవులను ముడుచుకోవడం వంటివి చేసినప్పుడు, మనిషి తొడపై పడుకున్నప్పుడు అవి ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. అలాగే మనం వాటిని ఆలింగనం చేసుకున్నప్పుడు, వాటిని తొడపై పడుకోబెట్టుకున్నప్పుడు ఆవు, మనిషి మధ్య సానుకూల శక్తులు పరస్పర మార్పిడికి గురవుతాయి. ఆవులోని వేడి ఉష్ణోగ్రత, గుండెచప్పుడు మనిషి శరీరంలో ఆక్సిటోసిన్‌ను విడుదలకు ప్రేరేపిస్తాయని, ఫలితంగా మనిషిలో ఒత్తిడి తగ్గి, సానుకూల దృక్పథం పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది గొప్ప అనుభూతినిస్తుంది. చాలా మంది తాము ఊహించినదాని కంటే ఎక్కువ ప్రశాంతత పొందామని చెబుతున్నారు’’ అని కౌ హగ్గింగ్ వెల్నెస్ సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ విషయాన్ని గ్రహించిన మరికొంత మంది కౌ హగ్గింగ్ థెరపీని ఫాలో అవుతున్నారు. అలా స్విట్జర్లాండ్ నుంచి అమెరికా వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ కౌ హగ్గింగ్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. కొంతమంది ఆవును ఆలింగనం చేసుకొని ఫొటోలు దిగి సోషల్‌మీడియాలో పెడుతున్నారు. అలా ప్రస్తుతం ఈ కౌ హగ్గింగ్ థెరపీ నెట్టింట్లోనే కాదు, ప్రపంచమంతటా ట్రెండ్ అవుతోంది.