Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
సహకార ‘వాహ్‌’ద్యం!
వాద్య సంగీతానికి డిమాండ్‌
చదువుతోపాటు బ్యాండ్‌ సంస్కృతి
కళాశాల స్థాయిలోనే బృందాలు; ఉపాధికి బాటలు
ఈనాడు, హైదరాబాద్‌: మామూలుగా సహకార వాయిద్యమంటే కాసింత చిన్నచూపు! సంగీతంలోనైనా... సమాజంలోనైనా! ద్వితీయశ్రేణిగా పరిగణింపు! కానీ కాలం మారింది! ముఖ్యంగా యువతరం రంగ ప్రవేశంతో! విద్యనభ్యసిస్తూనే అభిరుచి కొద్దీ ఏదో ఓ వాయిద్యం నేర్చుకొనే ధోరణి యువతలో పెరుగుతోంది. కారణం- అభిరుచిని ఉపాధిగా మార్చుకొని ఆ విభాగంలో నెగ్గుకు రావాలనుకొనే వాళ్లకి అవకాశాలు కల్పిస్తోంది వాద్య సంగీతం. డిమాండ్‌ మేరకు కళాకారులు కనిపించని విభాగమిది. కేవలం సినిమా సంగీతంలోనే కాదు రాక్‌, ఫ్యూజన్‌ బ్యాండ్‌ రంగంలోనూ పాశ్చాత్య వాద్యాలపై రాగాలు పలికించే వాళ్లకి బోలెడన్ని అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లో అయిదారుగురు ఒక బృందంగా ఏర్పడి నిర్వహించే బ్యాండ్‌కి ఒక కార్యక్రమానికి రూ.50 వేల వరకూ దక్కుతోంది. ముంబయి, ఢిల్లీ, బెంగళూరుల్లో రూ.లక్ష పైనే పారితోషికంగా తీసుకొంటున్న వాళ్లూ ఉన్నారు. సినిమాల్లో అయితే వర్థమాన గాయకులకు పాటకు రూ.10 వేలు అటూ ఇటూగా ఇస్తారు. విషయం ఉన్న వాద్య కళాకారులకి పాటకు రూ.50 వేల రూపాయలుపైనే ఇస్తున్న సందర్భాలూ ఉన్నాయి. కేవలం కొన్ని నిమిషాల పాటు తమ వాద్యంతో రాగం పలికించే వాళ్లకు రూ.10 వేల వరకూ ఇస్తున్నారు. గాయకులకు నిత్యం పాటలు పాడే అవకాశం రాకపోవచ్చు. కానీ ‘విషయం ఉన్న’ కీ బోర్డు ప్లేయర్‌, గిటార్‌, వీణ లాంటి వాద్యకారులకు మాత్రం డిమాండ్‌ ఉంది. కీ బోర్డు, గిటార్‌, డ్రమ్స్‌ కళాకారులకు రాక్‌ సంగీత కార్యక్రమాల్లోనో, సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. కీ బోర్డు, గిటార్‌లాంటి వాద్యాలకు హైదరాబాద్‌ కుర్రాళ్ళకు చెన్నై నుంచి పిలుపు వస్తోంది.

చదువుకొంటూనే...
అయితే నవతరంలో పాశ్చాత్య సంగీతమ్మీద ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. అందుకు తగ్గ వాద్యాలు నేర్చుకొనే వాళ్లూ కనిపిస్తున్నారు. గిటార్‌, కీబోర్డ్‌, డ్రమ్స్‌పై మక్కువ చూపుతున్నారు. వీరికి రాక్‌, హిప్‌హాప్‌, పాప్‌ పాడే గాయకులూ తోడవుతున్నారు. వీరంతా కళాశాల దశ నుంచే రాక్‌ బ్యాండ్‌ బృందాలుగా ఏర్పడి ప్రదర్శనలిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ తరహా బృందాలు 25 దాకా ఉన్నాయి. స్టార్‌ హోటళ్లలోనూ, ప్రధానమైన ఈవెంట్లలోనూ, వారాంతాల్లోనూ వీళ్ల ప్రదర్శనలుంటున్నాయి. అంతేకాకుండా కాలేజీల్లో కార్యక్రమాలకూ పిలుపులందుతున్నాయి. వీరి సంగీతానికి యువత నుంచీ మంచి స్పందన వస్తోంది. కొందరు వీ, ఎమ్‌, వీహెచ్‌1 లాంటి మ్యూజిక్‌ ఛానెళ్లలోనూ ప్రదర్శనలిస్తూ గుర్తింపు పొందుతున్నారు.

కొద్ది సమయంలోనే....
కార్యక్రమాలు ఒకెత్తైతే.... సినిమా అవకాశాలు మరో ఎత్తు! కీ బోర్డులో నైపుణ్యం సాధించిన వాళ్లకు పాటకు రూ.25 వేల నుంచి రూ.50 వేలు వరకూ దక్కుతోంది. కాస్త పేరున్న వారు రూ. లక్షల్లోనే డిమాండ్‌ చేస్తున్న సందర్భాలున్నాయి. షెహనాయ్‌ అనే వాద్యం విషయంలో తెలుగు, తమిళ చిత్రసీమల్లోని ప్రముఖ సంగీత దర్శకులు ఎక్కువగా బాలేష్‌ అనే వాద్యకారుడిపైనే ఆధారపడతారు. ఆయన ఇచ్చిన కాల్షీట్‌ ప్రకారమే రికార్డింగ్‌ చేసుకొనే సందర్భాలూ ఉంటున్నాయి. ఒక పాటలో ఒక వాద్యం కొన్ని సెకన్లో, మహా అయితే ఒక నిమిషంపాటో వినిపిస్తుంది. ఆ కొద్ది సమయంపాటు పలికించే సంగీతానికి రూ.10వేల వరకూ పారితోషికం దక్కుతుంది. గాయకుల తరహాలోనే వాద్యకారులకీ విదేశాల్లో ప్రదర్శనలిచ్చే అవకాశాలు వస్తున్నాయి. హైదరాబాద్‌కి చెందిన గిటారిస్టులూ, సంప్రదాయ వాద్యకారులు అడపాదడపా విదేశాలు వెళ్లి వస్తూనే ఉన్నారు. అయితే చెన్నైతో పోల్చుకొంటే హైదరాబాద్‌లో పాశ్చాత్య, సంప్రదాయ వాద్యాలపై శిక్షణ ఇచ్చే గురువుల కొరత లేకపోలేదు. గమ్మత్తేమంటే దీన్ని యువతరం అంతర్జాలంతో అధిగమించటం! మన దగ్గర ఉన్న రాక్‌, ఫ్యూజన్‌ బ్యాండ్లలో గిటార్‌, డ్రమ్స్‌లాంటివి పలికించే వాళ్లలో కొందరు నెట్‌ ద్వారా సంగీతం నేర్చుకొన్న వాళ్లూ ఉంటున్నారు. లండన్‌లోని ట్రినిటీ కాలేజ్‌లాంటి సంస్థలు వివిధ దశలో పరీక్షలు నిర్వహిస్తాయి. వాటికి సంబంధించిన సిలబస్‌ ప్రకారం చదువుకొని గిటార్‌, పియానో లాంటి వాద్యాలకు సంబంధించిన పరీక్షలకు హాజరవుతున్నవాళ్లూ ఉన్నారు. ఈ కొరతను దృష్టిలో ఉంచుకొనే ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ తను నిర్వహిస్తున్న సంగీత శిక్షణ సంస్థలో వాద్యకారులకు సంబంధించిన కోర్సులు ప్రారంభించారు.

‘‘ఎక్కువగా సినిమాకు పని చేస్తున్నాను. శాస్త్రీయ కచేరీల్లో మాండలిన్‌పై సంగీతం పలికిస్తాను. అరబ్బీ, చైనీస్‌ వాద్యాలపైనా పట్టు ఉంది కాబట్టే సినిమా సంగీతంలో ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి. ఆ రంగంలో పని చేసేందుకు సంగీతంలో ప్రావీణ్యంతోపాటు టెక్నిక్‌ కూడా తెలియాలి. ఇక హైదరాబాద్‌లో రాక్‌ బ్యాండ్‌ సంస్కృతి కొద్ది సంవత్సరాలుగా వూపందుకొంటోంది. యువత అటు వైపు వెళ్తే నెగ్గుకు రావచ్చు. ఒక వాద్యంపైన పట్టు రావాలంటే అందుకు ఏడేళ్ల నుంచి పదేళ్లపాటు సాధన చేయాలి.’’
- సుభానీ (10 వాద్యాలు పలికించే కళాకారుడు)
దేని ప్రత్యేకత దానిదే
‘‘స్టింగ్స్‌ విభాగానికి చెందిన వయోలిన్‌, చెల్లో, వయోలా, డబుల్‌ బేస్‌ వాద్యాలకు తగిన కళాకారులు లేరు. వాటి విషయంలోనూ తగిన శిక్షణ పొందితే యువకులకు అవకాశాలు దక్కుతాయి. కీ బోర్డులోనే అన్నీ ఉన్నాయనుకోవడం సరికాదు. ఏ వాద్యం ప్రత్యేకత దానిదే.’’
- కోడూరి కల్యాణి (సంగీత దర్శకుడు)

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

అనుక్షణం ఉత్కంఠగా... ‘క్షణం’

అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథనంతో తెరకెక్కిన చిత్రం ‘క్షణం’. పీవీపీ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి రవికాంత్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net