Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

పాతాళానికి గంగ

శ్రీశైలంలో అడుగంటిన జలం
806.30 అడుగులకు పడిపోయిన నీరు
రెండు నెలలుగా నిలిచిన విద్యుదుత్పత్తి
ఈనాడు డిజిటల్‌-కర్నూలు

శ్రీశైలం జలాశయంలో రోజురోజుకీ నీరు అడుగంటుతోంది. ప్రస్తుతం కనిష్ఠ మట్టాలకు చేరుకుంది. ఈసారి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో వరుణుడు ముఖం చాటేశాడు. వర్షాలు సకాలంలో పడకపోవడంతో  జలాశయంలో జలకళ కనిపించడం లేదు.  ఇప్పటికి  కూడా ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడలేదు. అక్కడి జలాశయాలూ అడుగంటాయి. భారీగా వర్షాలు పడితే తప్ప జలాశయాలన్నీ నిండి దిగువకు నీరు రాని పరిస్థితి నెలకొంది. మరోవైపు  ఇప్పటికే  విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. శ్రీశైలం జలాశయంలో నీరు అడుగంటడంతో ఖరీఫ్‌కు నీరందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 806.30 అడుగులకు పడిపోయింది. 215.80 టీఎంసీల నీటి సామర్థ్యం కాస్తా.. 32.24 టీఎంసీలకు తగ్గిపోయింది. నిపుణులు సూచించిన ప్రకారం జలాశయంలో తప్పకుండా 30 టీఎంసీల నీరు నిల్వ ఉండాలి. అందువల్ల దిగువకు నీరు వదల్లేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఖరీఫ్‌ ప్రారంభం కానుండడంతో రైతులు నీరు కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికీ కానరాని నీరు
గత పదేళ్లుగా మృగశిర కార్తె నుంచి 28 రోజుల్లోగా జలాశయానికి నీరు వచ్చి చేరుతుండేది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఇప్పటికీ ఎగువ రాష్ట్రాలతో పాటు ఇక్కడ కూడా భారీ వర్షాలు పడిన దాఖలాలు లేవు. కృష్ణా జలాలు రావాలంటే ఆలమట్టి, నారాయణపూర్‌, జూరాలకు 156 టీఎంసీల అవసరం తీరితేనే వరద నీరు కిందకు వచ్చేది. వాస్తవానికి ప్రతి ఏటా వరద నీరు మొదట తుంగభద్రకు వస్తుంది. అలా చూసినా తుంగభద్రలో సుమారు 98 టీఎంసీల నీరు నిండితేనే కానీ కిందకు నీటిని వదిలే పరిస్థితి లేదు. ఇలా శ్రీశైలానికి ఈ ఏడాది వరద నీరు చేరడం కష్టంగా మారింది.

నిలిచిన విద్యుదుత్పత్తి
రాష్ట్రానికి  అవసరమైన సుమారు 43 శాతం విద్యుత్తును సరఫరా చేసే శ్రీశైలం విద్యుత్తు కేంద్రాలు మూతపడ్డాయి. సాధారణ రోజుల్లో కుడిగట్టు కేంద్రంలో 770 మెగావాట్లు, తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు కేంద్రంలో  900 మెగావాట్ల విద్యుదుత్పత్తి  అవుతుంది. జలాశయంలో నీటి మట్టం తక్కువగా ఉండటం, కృష్ణా  రివర్‌ బోర్డు ఆదేశాలివ్వకపోవడంతో గత రెండు నెలలుగా కుడిగట్టు కేంద్రంలో  విద్యుదుత్పత్తి  జరగడం  లేదని ఇన్‌ఛార్జి ఎస్‌ఈ  రాంబాబు తెలిపారు. ఇదే పరిస్థితి ఎడమ గట్టు కేంద్రంలోనూ ఉంది. కుడిగట్టు కేంద్రంలో నెలకు  552.27 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి దెబ్బతింటోంది.

176 టీఎంసీలు ఇస్తేనే..
శ్రీశైలానికి వచ్చే వరద నీటిలో ప్రతి ఏటా కొంత కేటాయిస్తేనే రాయలసీమ జిల్లాల్లో ఖరీఫ్‌కు నీరందుతుంది. రాయలసీమలోని ఎస్సార్బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్‌, టీజీపీ, కేసీ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌, మద్రాసు తాగునీటి పథకాలకు నీరు ఇవ్వాల్సి ఉంది. అంతా కలిపి సుమారు 176 టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉంది. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులు పైన ఉంటేనే రాయలసీమకు నీరందే అవకాశం ఉంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.