Anand Mahindra: జేఈఈ-యూపీఎస్సీలో ఏది కష్టమైన పరీక్ష?.. మహీంద్రా సమాధానమిదే!

జేఈఈ - యూపీఎస్సీ పరీక్షల్లో ఏది కఠినమైందో ఆనంద్‌ మహీంద్రా చెప్పారు. అంతేకాదు.. ప్రపంచంలోనే టాప్‌ 10 పరీక్షల జాబితాలో మార్పులు చేయాలని సూచించారు.

Published : 04 Feb 2024 18:24 IST

ముంబయి: యూపీఎస్సీ (UPSC) - జేఈఈ (JEE) రెండింటిలో ఏది కష్టమైన పరీక్ష అంటే వెంటనే సమాధానం లభించకపోవచ్చు. దీనికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) తనదైన శైలిలో సమాధానమిచ్చారు. అంతేకాదు.. ప్రపంచంలోనే కఠినమైన పరీక్షల జాబితాలో మార్పులు చేయాలని సూచించారు. ఇటీవల విడుదలై ఘన విజయం అందుకున్న ‘12th ఫెయిల్‌’ (12th Fail) సినిమా చూసిన తర్వాత స్వయంగా  యువతతో మాట్లాడి.. యూపీఎస్సీ, జేఈఈలో కఠినమైన పరీక్షను నిర్ణయించినట్లు చెప్పారు. 

‘‘12th ఫెయిల్‌ సినిమా చూశాను. తర్వాత కొంత మంది యువతీయువకులతో మన దేశంలో నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో కష్టమైన దాని గురించి చర్చించాను. వారిలో ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి, బిజినెస్‌ స్టార్టప్‌లో పనిచేస్తున్న వ్యక్తిని కలిశాను. గతంలో అతను యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. ఐఐటీ జేఈఈ పరీక్ష కంటే యూపీఎస్సీ కష్టమైందని అతను స్పష్టంగా చెప్పాడు. ఇదే అభిప్రాయం అందరిలో ఉంటే.. ఈ ర్యాకింగ్స్‌ను మార్చాల్సి ఉంటుంది’’ అని ట్వీట్ చేశారు.

దాంతోపాటు ప్రపంచంలోనే కఠినమైన పరీక్షలివేనంటూ.. ‘ది వరల్డ్‌ ర్యాంకింగ్‌’ గతేడాది రూపొందించిన టాప్‌ 10 ప్రవేశ పరీక్షల జాబితాను షేర్‌ చేశారు. దాని ప్రకారం.. చైనాలో ‘గవోకావో’ పరీక్ష మొదటి స్థానంలో ఉంది. రెండులో ‘ఐఐటీ జేఈఈ’, మూడో స్థానంలో ‘యూపీఎస్సీ’ పరీక్షలు ఉన్నాయి. ఈ జాబితాలో ‘గేట్‌’ (GATE) పరీక్ష ఎనిమిదో స్థానంలో ఉంది. వీటితోపాటు అమెరికా, కెనడా, ఇంగ్లాండ్‌ దేశాల్లో నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌లు ఇందులో ఉన్నాయి. పోటీ పరీక్షల గురించి మహీంద్రా చేసిన ట్వీట్‌ చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు జేఈఈ కఠినమైన పరీక్షని కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు యూపీఎస్సీ కష్టమైనదని ట్వీట్‌ చేస్తున్నారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని