సివిల్స్‌లో ‘అనన్య’సామాన్యం.. సొంత ప్రిపరేషన్‌తో తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు

యూపీఎస్సీలో తెలంగాణకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకుతో మెరిశారు.

Updated : 16 Apr 2024 20:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్‌ తుది ఫలితాల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే తన అసాధారణ ప్రతిభతో మూడో ర్యాంకు సాధించారు. పదో తరగతి వరకు మహబూబ్‌నగర్‌ గీతం హైస్కూల్‌లో చదివిన అనన్య.. ఇంటర్‌ విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. దిల్లీలోని మెరిండా హౌస్‌ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే ఈ ఘనతను సాధించారు. 

యూపీఎస్సీ సివిల్స్‌ తుది ఫలితాలు వచ్చేశాయ్‌.. తెలుగు అమ్మాయికి మూడో ర్యాంకు

‘సివిల్స్‌’ పరీక్ష ఎంతో కఠినంతో కూడినది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూలలో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎదుర్కొని నిలవడం ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటిది తొలి ప్రయత్నంలోనే కోచింగ్‌ కూడా తీసుకోకుండా దాదాపు సొంత ప్రిపరేషన్‌తోనే సివిల్స్‌లో జాతీయస్థాయిలో మూడో ర్యాంకుతో భళా అనిపించారు అనన్య రెడ్డి.  ఇంటర్వ్యూ తర్వాత సివిల్స్‌కు ఎంపిక అవుతానని భావించినప్పటికీ.. మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదని ఆమె చెప్పారు. సొంత ప్రణాళికతోనే రోజుకు 12 నుంచి 14 గంటల పాటు చదివినట్లు తెలిపారు. చిన్నప్పటినుంచే సమాజానికి సేవ చేయాలన్న కోరికతోనే సివిల్స్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు.

కౌశిక్‌.. సివిల్స్‌లో అదుర్స్‌!

సివిల్స్‌కు ఎంపిక కావడమే లక్ష్యంగా క్యాప్‌ జెమినీలో ఉద్యోగం వదులుకొని మెయిన్స్‌కు ప్రిపేర్‌ అయిన కౌశిక్‌.. తొలి ప్రయత్నంలోనే 82వ ర్యాంకుతో సత్తా చాటారు. ఓయూలో సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేసిన ఆయన.. దిల్లీలో ఎంబీఏ చేశారు. అందరూ చదివినట్లే చదివానని.. రోజుకు ఎనిమిది, తొమ్మిది గంటల పాటు ప్రిపేర్‌ అయినట్లు ఆయన ‘ఈటీవీ’తో చెప్పారు.  ‘‘ఎంబీఏ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు సివిల్స్‌కు ప్రిపరేషన్‌ మొదలు పెట్టా. ఆ తర్వాత ఏడాది పాటు జాబ్‌ చేశాను. ప్రిలిమ్స్‌ తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి మెయిన్స్‌ రాశాను. ఐఏఎస్‌ అవ్వాలనేది నా లక్ష్యం. నాకు 100లోపు ర్యాంకు వస్తుందని మాత్రం అసలు ఊహించలేదు. సెలెక్ట్‌ అయితే చాలనుకున్నా.. కానీ.. అదృష్టం, దేవుడి దయవల్లే ఈ ర్యాంకు సాధించా. నాన్న కన్‌స్ట్రక్షన్‌ ఫీల్డ్‌లో పనిచేస్తారు. అమ్మ గృహిణి. నాన్నకు తెలిసిన కొందరు ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లను కలవడం, ఇతరుల గైడెన్స్‌తో పాటు కొన్ని స్టాండర్డ్‌ సోర్సులు నాకు బాగా ఉపయోగపడ్డాయి. నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యంగా దివ్యాంగుల కోసం, ఆరోగ్య రంగంపై పనిచేయాలని ఉంది’’ అని అన్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని