AP TET: ఏపీ టెట్‌ ఫలితాలపై విద్యాశాఖ తాజా అప్‌డేట్‌!

AP TET Results: ఏపీలో టెట్‌ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి విద్యాశాఖ తాజా అప్‌డేట్‌ ఇచ్చింది. ఎన్నికల కమిషన్‌ అనుమతి తర్వాతే విడుదల చేస్తామని పేర్కొంది.

Updated : 21 Mar 2024 16:27 IST

అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) ఫలితాల కోసం అభ్యర్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో విద్యాశాఖ స్పందించింది. ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే టెట్‌ ఫలితాలు (AP TET Results) వెల్లడిస్తామని పేర్కొంటూ అధికారిక వెబ్‌సైట్‌ https://aptet.apcfss.in/లో ప్రకటన చేసింది. మరోవైపు, టెట్‌లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాలు ఎంతో కీలకంగా మారాయి. షెడ్యూల్‌ ప్రకారమైతే మార్చి 14వ తేదీనే టెట్‌ ఫలితాలు వెల్లడి కావాల్సిఉంది. అయితే, అధికారులు ఆ షెడ్యూల్‌ ప్రకారం విడుదల చేయలేదు. ఈలోపు మార్చి 16న ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఇప్పుడు ఈసీ నుంచి అనుమతి రాగానే ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. 

దాదాపు ఐదేళ్ల పాటు కాలయాపన చేసిన వైకాపా సర్కార్‌ కేవలం ఎన్నికలకు కొన్ని నెలల ముందు హడావుడిగా టెట్‌, డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చింది. డీఎస్సీకి అభ్యర్థులు ప్రిపేర్‌ కావడానికి కూడా తగిన సమయం కూడా ఇవ్వకుండా షెడ్యూల్‌ రూపొందించింది. దీంతో ప్రభుత్వం తీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో డీఎస్సీ షెడ్యూల్‌ను మార్చిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలను రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలన్న లక్ష్యంతోనే కేవలం ఎన్నికలకు ముందు హడావుడిగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో ఇలాంటి అయోమయ పరిస్థితి తలెత్తిందంటూ పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు, డీఎస్సీ దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ.. పరీక్ష కేంద్రాల ఎంపికకు ఐచ్ఛికాలూ ఇంకా ఇవ్వలేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని