APPSC Group 2 Results: ఎన్నాళ్లీ ఎదురు చూపులు? ఫలితాలపై గ్రూప్‌-2 అభ్యర్థుల ఆవేదన

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ప్రిలిమ్స్ ఫలితాలు త్వరగా విడుదల చేయాలంటూ అభ్యర్థులు కోరుతున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Published : 07 Apr 2024 21:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ఫలితాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. శనివారం లోపే  ఈ ఫలితాలు విడుదలవుతాయని భావించినా ఇప్పటికీ రాకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. APPSC Group 2 Prelims ఫలితాలు త్వరగా విడుదల చేయాలని సోషల్‌ మీడియా వేదికగా తమ ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల కోసం వేచి చూస్తున్నామని..  వీలైనంత త్వరగా ప్రకటిస్తే మెయిన్స్‌కు ప్రిపేర్‌ అవుతామని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. ‘పరీక్ష జరిగి 42 రోజులైంది.. ఫలితాలు రెడీగా ఉన్నాయని పది రోజుల నుంచి అదిగో ఇదిగో అని చెప్పడమే. ఎలాంటి స్పష్టత లేదు. దయచేసి రిజల్ట్స్‌ ప్రకటించండి. సుదీర్ఘకాలం తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్‌ ఇది. ఫలితాల వెల్లడిలో జాప్యమెందుకు’’ అంటూ పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు.

మరోవైపు, ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్న విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌ జారీకి, ప్రిలిమ్స్‌ మధ్య ఉన్న తక్కువ సమయం సన్నద్ధతకు సరిపోకపోవడం, ప్రశ్నపత్రం కఠినంగా ఉండడం, ‘భారత సమాజం’ చాప్టర్‌కు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో ఆలస్యంగా రావడం వంటి కారణాలతో ఇబ్బంది పడ్డామని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున ప్రధాన పరీక్ష (మెయిన్స్‌) రాసేందుకు అవకాశం కల్పించాలని ఏపీపీఎస్సీ కార్యాలయానికి అభ్యర్థనలు వస్తున్నాయి. దీన్ని చురుగ్గా పరిశీలిస్తున్న కమిషన్‌.. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని