Study Notes: రాస్తున్నారా.. స్టడీ నోట్సు? మంచి మార్కుల కోసం ఇలా చేయండి!

స్టడీ నోట్సు రాయడం ద్వారా పాఠాలను సులువుగా ఆకళింపు చేసుకోవచ్చు. పరీక్షలకు ముందు వాటిని ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే ఒత్తిడి దూరం చేసుకోవచ్చు. స్టడీ నోట్స్‌ ఎలా రాసుకుంటే బాగుంటుందో ఇక్కడ చదవండి.

Updated : 27 Feb 2024 15:04 IST

Study notes | పరీక్షలకు ముందు మొత్తం సిలబస్‌ను రివిజన్‌ (Revision) చేయాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అందుకే తరగతి గదిలో పాఠాలు (Class Room Lessions) వింటున్నప్పుడో, చదువుతున్నప్పుడో ముఖ్యమైన పాయింట్లను రాసిపెట్టుకుంటే (Study Notes) ఈ పని చాలా సులువవుతుంది. పరీక్షల ముందు ఒక్కసారి పునశ్చరణ చేసుకోవడం ద్వారా ఒత్తిడినీ దూరం చేసుకోవచ్చు (Stress Management). ఒక్క మాటలో చెప్పాలంటే.. మంచి మార్కుల సాధనకు సోపానం లాంటిదే.. ఈ స్టడీ నోట్సు (Study Notes). తరగతి గదిలో గురువులు చెప్పే పాఠాల నుంచి, చదివిన పుస్తకాల నుంచి, ఇంటర్నెట్‌ నుంచి సంగ్రహించిన సమాచారం.. ఇలా ఏదైనా దాంట్లో కీలకమైన పాయింట్లను గ్రహించి రాసి పెట్టుకోవడం చాలా ప్రయోజనకరం. స్టడీ నోట్సును ఎలా రాస్తే మంచిదో ఇక్కడ చూద్దాం.. 

  • కొందరు విద్యార్థులు ముఖ్యాంశాలను పేపర్లపై రాసుకుంటారు. విడి పేపర్ల మీద రాయడం వల్ల సమయానికి అవి దొరక్కపోవచ్చు. ఒకవేళ ఇలా రాసుకున్నట్లయితే పేపర్ల మీద నంబర్లు వేసి వాటిని ఫోల్డర్‌లో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. చదువుకున్న తర్వాత వాటిని మళ్లీ అదే క్రమంలో పెట్టుకుంటే చాలు. లేదంటే కొన్ని పేపర్లకు పిన్నులు కొట్టుకున్నా నోట్‌ పుస్తకంలా ఉంటుంది. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిచ్చెనలా ఉపయోగపడే వీటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి.
  • నోట్సు మీ దగ్గరే ఉంటుంది గనక దాన్ని ఇష్టమొచ్చినట్టుగా రాసేయొద్దు. గజిబిజిగా రాసేస్తే కొంతకాలం తర్వాత.. మీరేం రాశారో మీకే అర్థం కాకపోవచ్చు. అందువల్ల కొట్టివేతలు, దిద్దడాలు లేకుండా వీలైనంత చక్కగా రాసుకోవాలి. స్పష్టంగా రాయకపోతే దాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.
  • లెక్చరర్లు చెప్పిందీ, పాఠ్యపుస్తకంలోని అంశాలు, ఇంకా ఇతర వనరుల నుంచి సేకరించిన సమాచారాన్ని సాధారణంగా ఇందులో రాస్తారు. కాబట్టి ఇందులోని అంశాలను చదివితే సరిపోతుంది. పదేపదే పాఠ్య పుస్తకాలను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. దీనిమీద నిరభ్యంతరంగా మీరు ఆధారపడొచ్చు. అవసరమైతే తగిన మార్పులూ, చేర్పులూ చేసుకోవచ్చు.
  • ఏదైనా అంశాన్ని నోట్సులో రాసే క్రమంలోనే నేర్చుకోవచ్చు కూడా. ముఖ్యాంశాలను పాయింట్ల రూపంలో రాస్తున్నప్పుడే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఆ సమాచారంపైన దృష్టిని నిలిపి రాస్తే మెదడులో నిక్షిప్తమవుతుంది. దాంతో ఆ అంశాన్ని పదేపదే చదవాల్సిన పని ఉండదు. దీంతో సమయమూ వృథా కాదు.
  • అధ్యాపకులు బోధన కోసం ఒక్క పాఠ్య పుస్తకాల పైనే ఆధారపడరు. పలు పుస్తకాలను రిఫర్‌ చేసి, తమ అనుభవాన్ని రంగరించి పాఠాలు చెబుతారు. అందువల్ల పాఠం చెప్పడం మొదలుపెట్టకముందే నోటు పుస్తకం, పెన్నుతో సిద్ధంగా ఉండాలి.
  • ఏకాగ్రతతో తరగతులను విన్నప్పుడే అందులోని ముఖ్యాంశాలను గుర్తించి వెంటనే రాయగలుగుతారు. సాంకేతిక పదాలు, నిర్వచనాలు ఉంటే.. వాటిని ఎంతో జాగ్రత్తగా విని, రాయాలి. కొన్నిసార్లు పాఠ్యాంశంలోని ముఖ్య సమాచారాన్ని రాసుకోమని అధ్యాపకులూ చెబుతుంటారు. అవి పాఠ్యపుస్తకాల్లోనూ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏమాత్రం ఆలస్యం, అశ్రద్ధ చేయకుండా వెంటనే స్టడీ నోట్సులో రాసుకోవాలి.
  • పాఠ్య పుస్తకంలోని పాఠాలు ఉండే క్రమంలోనే స్టడీ నోట్సులోనూ రాసుకుంటే.. ఆ తర్వాత వెతుక్కోవాల్సిన పని మీకు తప్పుతుంది. కొన్ని పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడం కాస్త కష్టమైతే.. అలాంటప్పుడు ఉదాహరణలు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి అవసరమైన వాటికి ఉదాహరణలు రాయడాన్ని మర్చిపోకూడదు.
  • తరగతిలో చెప్పింది చెప్పినట్టుగా కాకుండా.. స్టడీనోట్సును సొంత వాక్యాల్లో రాసుకుంటే ఎంతో ఫలితం ఉంటుంది. దీంతో విషయాలు సులభంగా అర్థం కావడమే కాకుండా ఎక్కువ కాలం పాటు గుర్తుంటాయి కూడా.
  • నోట్సును వ్యాసం లేదా ముఖ్యమైన పాయింట్ల రూపంలో ఎలాగైనా రాసుకోవచ్చు. అయితే ఎలా రాసినా క్రమపద్ధతిలో ఉండేలా చూసుకోవాలి. శీర్షికలు, ఉపశీర్షికలు ఉపయోగించి.. వాటి కింద పాయింట్లు సంబంధిత అంశాన్ని రాసుకుంటే మంచిది. శీర్షికలకు వేర్వేరు రంగులు ఉపయోగించాలి. దీనివల్ల అంశాల మధ్య తేడాను సులభంగా గుర్తించవచ్చు.
  • అవసరమైనచోట టేబుళ్లు, డయాగ్రమ్‌లూ వేసుకోవాలి. ముఖ్యమైన సమాచారాన్ని హైలైట్‌ చేసుకుంటే పరీక్షల సమయంలో చదవడం సులువవుతుంది. నోట్సును అర్థమయ్యేలా చేత్తో రాసుకోవడమే మంచిది. ఇలాచేస్తే ఆయా అంశాలు ఎక్కువ కాలంపాటు గుర్తుంటాయి. అలాగే ముఖ్యాంశాలను క్రమపద్ధతిలో రాసుకుంటే పరీక్షలోనూ అదే క్రమాన్ని అనుసరించి రాయగలుగుతారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని