Exams Preparation: చదువుతుంటే ఏకాగ్రత కుదరడం లేదా? ఈ టెక్నిక్‌ ట్రై చేయండి!

 కాసేపు పుస్తకం చదవగానే ఇతర అంశాలపైకి దృష్టి మళ్లటమో, అలసిపోవటమో జరుగుతోందా? అయితే ఈ టెక్నిక్‌ మీకు ఉపయోగపడొచ్చు.. ట్రై చేయండి.

Published : 18 Feb 2024 10:32 IST

Exams Preparation Techniques | ఇంటర్నెట్‌ డెస్క్‌: అసలే ఇది పరీక్షల (Exams preparation) కాలం.. ఒకవైపు వార్షిక పరీక్షలు.. మరోవైపు పోటీ పరీక్షలు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడిని తట్టుకొని ఏకాగ్రతతో చదవడం పెద్ద సవాల్‌. కాసేపు పుస్తకం చదవగానే ఇతర అంశాలపై దృష్టి మళ్లటమో, అలసిపోవటమో జరుగుతుంటుంది. స్మార్ట్‌ఫోన్‌ చేతిలోకి వచ్చాక ఈ సమస్య మరీ పెరిగింది. దీన్ని అధిగమించి ఏకాగ్రతతో ఎక్కువ సమయం చదివేందుకు ఓ టెక్నిక్‌ ఉంది. అదే ‘పొమడోరో’ (టొమాటో) టెక్నిక్‌ (Pomodoro Technique). ఇది మనం చేసే పని పట్ల ఏకాగ్రతను పెంచి ఒత్తిడిని తగ్గించే టైమ్‌ మేనేజ్‌మెంట్‌ పద్ధతి. ఈ టెక్నిక్‌ను అనుసరిస్తే.. హైరానా పడకుండా హాయిగా మనసు కేంద్రీకరించి చదువుకోవచ్చు. 

  • చదవాల్సిన చాప్టర్ల జాబితా పెట్టుకోవాలి.
  • 25 నిమిషాలకు టైమర్‌ను పెట్టుకోవాలి.
  • టైమర్‌ మోగేదాకా చదవాలి.
  • 3-5 నిమిషాల విరామం తీసుకోవాలి.
  • మరో 25 నిమిషాలు చదివి, 5 నిమిషాల విరామం తీసుకోవాలి.
  • ఇలా 4 సార్లు చేశాక 15- 30 నిమిషాల విరామం తీసుకోవాలి.

ఇలా విరామం ఇస్తూ పఠనం కొనసాగిస్తే సంపూర్ణ విషయ అవగాహన సాధ్యపడుతుంది. ప్రతి విరామాన్నీ ‘పొమడోరో’గా పేర్కొంటారు. టొమాటో ఆకారంలో ఉండే కిచెన్‌ టైమర్‌ పేరును బట్టి ఇది వాడుకలోకి వచ్చింది. పొమడోరో అనేది ఇటాలియన్ పదం. దీనికి అర్థం టొమాటో. ఈ టెక్నిక్‌ను ఫ్రాన్సిస్కో సిరిల్లో అనే వ్యక్తి యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు. ఆయన 25 నిమిషాల సెషన్‌లను కొలిచేందుకు పొమోడోరో టైమర్‌ను వినియోగించారు. అందుకే దీన్ని పొమడోరో టెక్నిక్‌గా పేర్కొంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని