Exams Preparation Tips: పోటీ పరీక్షలు రాస్తున్నారా?ఇలా చదివితే మీరే విజేత!

పోటీ పరీక్షలు రాసేవారికి సరైన ప్రణాళిక లేకపోతే రాణించడం కష్టం. నిపుణులు సూచించే ఈ మార్గదర్శకాలు ప్రిపరేషన్‌లో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.

Updated : 25 Feb 2024 15:01 IST

Exams Preparation Tips | ఇంటర్నెట్‌ డెస్క్‌: పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నవారికి ఇది అత్యంత కీలక సమయం. ఒకవైపు, టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 (TSPSC Group 1 Exam) పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ మొదలు కాగా.. ఇంకొన్ని రోజుల్లోనే ఏపీలో డీఎస్సీ (AP DSC 2024), టెట్‌ జరగనుండటంతో అభ్యర్థులు కసితో చదువుతున్నారు. దీనికితోడు యూపీఎస్సీ సివిల్స్‌ (UPSC Civils)తో పాటు టీఎస్‌పీఎస్సీ (TSPSC), ఎస్‌ఎస్‌సీ (SSC), ఐబీపీఎస్‌ (IBPS) తదితర సంస్థలు నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు ఏటా లక్షలాది మంది పోటీ పడుతుంటారు. పది, ఇంటర్‌, డిగ్రీ విద్యార్హతలతో ప్రభుత్వ కొలువుల కోసం కష్టపడి ప్రిపేర్‌ అవుతుంటారు. పరీక్షలు ఏవైనా గానీ నిపుణులు సూచించే ఈ మార్గదర్శకాలు మిమ్మల్ని విజేతలుగా నిలపడంలో ఉపయోగపడతాయి.

  • పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే చదివిన సబ్జెక్టుపై పట్టు పెంచుకోవడం ముఖ్యం. అంటే చిన్న తరగతి నుంచీ చదివిన ప్రాథమికాంశాలను బాగా గుర్తుంచుకోవాలి. ప్రతి పాఠ్యాంశంలోని ముఖ్యంశాలనూ నోటు పుస్తకంలో రాసుకోవడం అలవాటు చేసుకోవాలి.
  • ఉద్యోగ ప్రకటన వెలువడిన తర్వాతా, పరీక్ష రాసేనాటికీ వ్యవధి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా సబ్జెక్టు పరిజ్ఞానం, వర్తమాన అంశాలపై అవగాహన పెంచుకుంటూ ఉండాలి.
  • పోటీ పరీక్షలకు ముఖ్యంగా కావాల్సింది సమయ నిర్వహణ. టైమ్‌టేబుల్‌ వేసుకుని ప్రతి సబ్జెక్టుకూ, చాప్టరుకూ నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ టైమ్‌టేబుల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కచ్చితంగా పాటించాలి. మూడ్‌ బాలేదనో.. వినోద కార్యక్రమాల కోసమో చదవాల్సిన వాటిని వాయిదా వేస్తూ వెళ్లొద్దు. 
  • వ్యక్తిగత క్రమశిక్షణ, అంకితభావం ఎంతో అవసరం. ఒకేసారి అన్నీ చదివేయాలనే ఆత్రుత అస్సలు పనికిరాదు. వాస్తవానికి దగ్గరగా ఉండే లక్ష్యాలను ఏర్పాటుచేసుకోవాలి. వాటి సాధనకు నిరంతరం కృషిచేయాలి. చిన్నచిన్న అవాంతరాలు ఎదురైనా వాటిని తట్టుకుని ఏకాగ్రతతో చదవాలి.
  • ప్రాక్టీస్‌ ప్రశ్నలూ, పాత ప్రశ్నపత్రాలనూ సాధన చేయడం చాలా అవసరం. వీలైనన్ని ఎక్కువ పేపర్లను సాధన చేయడానికి ప్రయత్నించాలి. ఇలాచేస్తే పరీక్ష విధానాన్ని అర్థంచేసుకోవడం సులువు. అవగాహన పెరగడంతో పరీక్ష ఎలా ఉంటుందోననే ఆందోళన కూడా తగ్గుతుంది. సమస్యా పరిష్కార నైపుణ్యమూ పెరుగుతుంది.
  • ప్రశ్నపత్రంలో తెలిసిన అంశాలు చాలానే ఉన్నా.. వాటిని నిర్దిష్ట సమయం లోపల రాయలేక చాలామంది ఇబ్బందిపడుతుంటారు. కాబట్టి ఆ సమయంలోనే అన్ని అంశాలూ రాయగలుగుతున్నారో లేదో చూసుకోవాలి. ఉదాహరణకు పరీక్ష సమయం రెండు గంటలు అయితే.. పాత ప్రశ్నపత్రాన్ని ఆ వ్యవధిలోనే పూర్తిచేయాలి. మొదట్లో కొన్ని ప్రశ్నలు మిగిలిపోయినా ఆ తర్వాత సాధన చేస్తుంటే ఈ సమస్య తలెత్తదు.
  • చదివే క్రమంలో ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ఇలాంటప్పుడు సీనియర్ల, లెక్చరర్ల, నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పునశ్చరణ, ప్రశ్నల సాధన, సందేహ నివృత్తి కోసం ఆన్‌లైన్‌ స్టడీ మెటీరియల్‌నూ ఉపయోగించుకోవచ్చు.
  • మాక్‌ టెస్ట్‌లు రాయడం అత్యంత అవసరం. తరచూ వీటిని రాయడం వల్ల సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. మీ సామర్థ్యాన్ని సమీక్షించుకునే అవకాశం కలుగుతుంది. ఏయే అంశాలను మెరుగుపరుచుకోవాలనే విషయంలో స్పష్టత వస్తుంది.  పనితీరును ఎప్పటికప్పుడు విశ్లేషించుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికలో మార్పులూ, చేర్పులూ చేసుకోవచ్చు.
  • ప్రిపరేషన్‌ సమయంలో కొంతమంది విద్యార్థులు విపరీతమైన ఆందోళన, ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఇలాంటప్పుడు మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి. యోగా, ధ్యానం, వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి ఉపశమనం పొందొచ్చు.
  • అంకితభావంతో ఎంత కష్టపడి చదివినా.. ఒక్కోసారి ప్రేరణ కరవవుతుంది. నిరాశగానూ అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉండే చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని సాధించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంతో రెట్టింపు ఉత్సాహంతో పరీక్షలు బాగా రాయడానికి మరింత కృషిచేయొచ్చు.
  • కొన్ని నెలలపాటు గంటలకొద్దీ కూర్చుని చదవడం వల్ల నడుంనొప్పీ, తలనొప్పీ, నిద్రలేమి.. లాంటి సమస్యలు బాధించే అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్యాన్ని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చదువు మధ్యలో చిన్న విరామం తీసుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే పోషకాహారం తీసుకోవడం, శరీరానికి తగిన వ్యాయామాలు చేయడం లాంటి చక్కని జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. 
  • విద్యార్థులందరి సన్నద్ధతా ఒకే విధంగా ఉండదు. కొందరు రాత్రిళ్లు ఎక్కువసేపు చదివితే.. మరికొందరు ఉదయాన్నే లేచి చదవగలుగుతారు. అందువల్ల ఎవరికి అనువుగా ఉండే సమయాలను వాళ్లు ఎంచుకుని సన్నద్ధతను సమర్థంగా కొనసాగిస్తే విజేతగా నిలవడం కష్టమేం కాదు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని