Exam Writing Tips: పది, ఇంటర్‌ పరీక్షల్లో మంచి మార్కులకు సూచనలివే..

ఎంత బాగా ప్రిపేర్‌ అయినా పరీక్ష సమయంలో పేపర్‌పై సరిగా ప్రజెంటేషన్‌ చేయకపోతే కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ప్రస్తుతం సీబీఎస్‌ఈ పరీక్షలు జరుగుతుండడం, త్వరలోనే ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కాబోతున్న వేళ మెరుగైన మార్కుల కోసం విద్యార్థులకు కొన్ని మెలకువలు..

Published : 22 Feb 2024 18:01 IST

Exams writing Tips| ‘‘పేపర్‌ ఈజీగా వచ్చింది.. కానీ టైమే సరిపోలేదు. కొన్ని వదిలేయాల్సి వచ్చింది’; ఏదీ వదలకుండా రాసినా.. మార్కులు సరిగా రాలేదు’’.. ఇలాంటి మాటల్ని పరీక్షలు రాసొచ్చిన విద్యార్థుల నుంచి వినబడుతుంటాయి. మంచి మార్కులు రావాలంటే ప్రశ్నలకు జవాబులు తెలిస్తే సరిపోదు.. వాటిని మెరుగ్గా పేపర్‌పై పెట్టే నైపుణ్యాలు కూడా తెలిసి ఉండాలి. ప్రస్తుతం సీబీఎస్‌ఈ (CBSE Exams) పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, త్వరలో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ బోర్డు పరీక్షలు రాయబోతున్న వారు ఈ మెలకువలు పాటిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. 

కంగారు పడొద్దు..

పరీక్ష హాలులోకి పావు గంట ముందే చేరుకొని విద్యార్థులు కాసేపు రిలాక్స్‌ కావాలి. ప్రశ్నపత్రం అందుకోగానే కంగారుగా కనిపించిన ప్రశ్నకు హడావుడిగా జవాబు రాయడం మొదలు పెట్టొద్దు. ఒకటికి రెండుసార్లు ప్రశ్నలను చూసుకోండి. ఎలా రాస్తే పరీక్షను విజయవంతంగా పూర్తి చేయవచ్చో ఆలోచించాలి. వాటిలో బాగా వచ్చినవేవో, చేయగలిగినవేవో గుర్తించాలి. ఆ ప్రకారం బాగా రాయగలిగిన వాటితో పరీక్ష ప్రారంభించాలి. తేలికగా, వేగంగా పూర్తయ్యే వాటిని ముందు రాయాలి. కొంచెం సమయం తీసుకునే వాటికి తర్వాత జవాబు ఇవ్వాలి. సమాధానాలు బాగా రాస్తున్న కొద్దీ విద్యార్థిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరీక్ష భయం తగ్గుతుంది. మర్చిపోయే అవకాశం ఉన్న జవాబులూ చురుగ్గా గుర్తుకు వచ్చే వీలుంటుంది.

సూటిగా.. సుత్తిలేకుండా..

చాలామంది విద్యార్థులు ప్రశ్నను చూడగానే జవాబు రాయడం మొదలు పెట్టేస్తుంటారు. ఎగ్జామినర్‌ ఒక్కోసారి వాటిలో చిన్న చిన్న మెలికలు పెడుతుంటారు. వాటిని గమనించకపోతే సమాధానం రాసిన తర్వాత మొత్తం వృథా అవుతుంది. పరీక్ష పూర్తయ్యాక చూసుకుంటే మార్కులు కోల్పోవాల్సి వస్తుంది. ఈ రెండు పరిస్థితులూ విద్యార్థికి నష్టం చేస్తాయి. ముందే ప్రశ్నను జాగ్రత్తగా చదివి, ప్రశ్నలో అడిగిందేమిటో అర్థం చేసుకుని రాయడం మొదలుపెట్టాలి.  ప్రశ్నలో అడిగినంతవరకే పరిమితమై సమాధానం రాయాలి. ప్రశ్న ఎంత బాగా వచ్చినా, సంక్షిప్తంగా రాయడానికే ప్రయత్నించాలి. వచ్చిన ప్రశ్నలను వివరంగా, అందంగా రాయాలనే ఉత్సాహం ఉంటుంది. దాన్ని అదుపులో పెట్టకపోతే చివర్లో సమయం సరిపోక ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది. అనవసర వివరణలను వదిలేసి సూటిగా రాయడం తెలివైన పని. 

ఎంత వరకు అవసరమో..!

ప్రశ్నపత్రాల్లో సాధారణంగా చాయిస్‌లు ఉంటాయి. కొన్నిసార్లు ప్రశ్నలు ఇచ్చి వాటిలో నచ్చినవి ఎంచుకోమంటారు. ఇంకొన్నిసార్లు ఇంటర్నల్‌ చాయిస్‌లూ (రెండు ప్రశ్నలు ఇచ్చి వాటిల్లో ఏదోఒకటి ఎంపిక చేసుకోమని అడగడం) ఇస్తారు. ఇంటర్నల్‌ ఛాయిస్‌ విషయంలో ఓ చిక్కు ఉంది. విద్యార్థులు చాలామంది తొందర్లో ఏదో ఒక ప్రశ్నను ఎంచుకుంటుంటారు. కొంత రాసిన తర్వాత ‘ఇది అనవసరంగా ఎంచుకున్నామే!’ అని బాధపడుతుంటారు. ఇంకోదాన్ని మొదలుపెడతారు. దాంతో అప్పటిదాకా ముందు ప్రశ్నకు ఉపయోగించిన సమయమంతా వృథా అవుతుంది. అందుకే ప్రశ్నను ఎంచుకునే ముందే సమాధానం ఎంతవరకూ గుర్తుందో ఆలోచించుకోవాలి. ఇంటర్నల్‌ ఛాయిస్‌ ప్రశ్నల్లో ఒక్కోసారి ఒక ప్రశ్న కిందే మళ్లీ రెండు ప్రశ్నలు ఉండవచ్చు. ఉదాహరణకు ఒక ప్రశ్నలో ఎ, బి ఉండి, మళ్లీ అందులో అ, ఆ.. విభాగాల కింద ప్రశ్నలు అడుగుతుంటారు. ఇలా ఉన్న ప్రశ్నలను జాగ్రత్తగా గమనించాలి. వాటిని ఎంచుకున్నప్పుడు మార్కులను బట్టి ఎంతవరకూ అవసరమో అంతవరకే రాయాలి.

అన్నీ రాయవచ్చు కానీ..

‘ఛాయిస్‌ ఉన్నప్పటికీ తెలిస్తే అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయడం మేలు..’ ఈ మాటను అందరూ చెబుతుంటారు. నిజానికి ఇది మంచి సూచనే. పైగా రుణాత్మక మార్కులు ఏమీ ఉండవు. ఏ ప్రశ్న విషయంలోనైనా పొరపాటుపడి మార్కులు కోల్పోయినా ఇంకో ప్రశ్న దగ్గర అవి కవర్‌ అవుతాయి. కానీ సమయం అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే అలాంటి ప్రయత్నాలు చేయాలి. ముందుగా పూర్తి చేయాల్సినవి రాసిన తర్వాతే అదనం జోలికి వెళ్లాలి. ప్రశ్నలకు సంబంధం ఉన్నా, లేకపోయినా తెలిసిందేదో పేజీలకు పేజీలు రాసేస్తే మార్కులు పడిపోతాయని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ అది కుదరని పని అని గుర్తించండి.

-ఇంటర్నెట్ డెస్క్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని