సహకార బ్యాంకుల్లో.. సేవలందిస్తారా!

Eenadu icon
By Features Desk Published : 04 Nov 2025 03:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

తెలంగాణలోని 6 ఉమ్మడి జిల్లాల  సహకార బ్యాంకుల్లో (డీసీసీబీ) స్టాఫ్‌ అసిస్టెంట్ల నియామకానికి రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టీజీసీఏబీ) ప్రకటన విడుదల చేసింది. డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్షలో ప్రతిభతో పోస్టులు భర్తీ చేస్తారు. ఇప్పటికే బ్యాంకు పరీక్షల సన్నద్ధతలో ఉన్నవారు ఈ పరీక్షను సులువుగానే ఎదుర్కోగలరు.

హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్‌ జిల్లా సహకార బ్యాంకుల్లో 225 పోస్టులు ఈ పరీక్షతో భర్తీ చేస్తారు. వీటిలో 25 శాతం ఖాళీలు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో (పీఏసీఎస్‌) పనిచేస్తోన్న వారితో నింపుతారు. ఈ పోస్టులకు తెలంగాణ స్థానికులే అర్హులు.

పరీక్ష ఇలా 

ఆన్‌లైన్‌లో ఆంగ్ల మాధ్యమంలో ఐబీపీఎస్‌ దీన్ని నిర్వహిస్తుంది. ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున 4 విభాగాల్లో 160 ప్రశ్నలు వస్తాయి. న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, జనరల్‌ అవేర్‌నెస్‌ (జనరల్, ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 30 ప్రశ్నలు, అవేర్‌నెస్‌ ఆన్‌ క్రెడిట్‌ కో-ఆపరేటివ్స్‌ 10 ప్రశ్నలు) ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. విభాగాల వారీ కనీస మార్కులు పొందాలి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు.

సన్నద్ధత సూచనలు

  • ముందుగా పరీక్ష విధానం, సిలబస్‌ క్షుణ్నంగా అర్థం చేసుకోవాలి. దీంతో విభాగాల వారీ ఆంశాలు, వేటిని చదవాలి, సమాచారం ఎక్కడ నుంచి పొందాలి.. ఇవన్నీ  గ్రహించవచ్చు.
  • ఆచరణీయంగా ఉండేలా స్టడీ ప్లాన్‌ సిద్ధం చేసుకోవాలి. రోజుకు ఎన్ని గంటలు చదవాలి, ఏ విభాగానికి ఎంత సమయం కేటాయించాలి, ఏ రోజు ఏ టాపిక్‌ పూర్తిచేయాలి.. ఇవన్నీ ముందే నిర్ఱయించుకోవాలి.. (డిసెంబరు మూడో వారంలో పరీక్ష ఉండొచ్చు. సుమారు 45 రోజుల సమయం ఉంటుంది). ఈ వ్యవధిలో సిలబస్‌ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. 
  • క్రెడిట్‌ కో-ఆపరేటివ్స్‌పై బాగా అవగాహన పెంచుకోవాలి. సహకార పరపతి సంఘాలు, జిల్లా సహకార బ్యాంకులు, అపెక్స్‌ బ్యాంక్, నాబార్డ్, ఆర్‌బీఐలపై పూర్తి అవగాహన ఉండాలి. అదేవిధంగా బ్యాంకింగ్, ఫైనాన్స్‌ రంగాలపై దృష్టి సారిస్తూ గత ఆరు నెలల కరెంట్‌ అఫైర్స్‌ బాగా చూసుకోవాలి. ప్రతిరోజూ వార్తా పత్రికలు చదువుతూ ముఖ్యమైన పాయింట్లను రాసుకోవాలి. వారాంతంలో వీటన్నింటినీ పునశ్చరణ చేయాలి.
  • అరిథ్‌మెటిక్, రీజనింగ్‌ సబ్జెక్టుల టాపిక్స్, కాన్సెప్ట్‌లపై గట్టి పట్టుండాలి. అప్పుడే ప్రశ్నలు సులభంగా సాధించగలిగే మెలకువలు, వేగంగా సమాధానం రాబట్టే పద్ధతులు (షార్ట్‌కట్స్‌) బాగా అర్థమవుతాయి. ఎక్కువ ప్రశ్నలు వచ్చే అంశాలు (టాపిక్స్‌) ముందు పూర్తి చేసుకోవాలి. ఏదైనా టాపిక్‌ పూర్తికాగానే దానిలోని వివిధ తరహా ప్రశ్నలు (సులభం, మధ్యస్థం, కఠినమైనవి) బాగా సాధన చేయాలి.  
  • ప్రతిరోజూ టాపిక్‌ టెస్టులు, సెక్షన్లవారీ టెస్టులు రాయాలి. ప్రతివారం పరీక్ష తరహా మాక్‌ టెస్ట్‌ రాయాలి. పరీక్షకు 15 రోజుల ముందు నుంచీ ప్రతిరోజూ ఒకటి లేదా రెండు మాక్‌ టెస్టులు రాస్తూ, వాటిని విశ్లేషించి తదనుగుణంగా వెనకబడ్డ టాపిక్స్‌ మెరుగు పరుచుకోవాలి. 
  • పునశ్చరణ తప్పనిసరిగా ఉండాలి. ప్రతిరోజూ రాత్రి ఆరోజు సాధన చేసిన వాటిని పునశ్చరణ చేయాలి. అదే విధంగా వారాంతంలో ఆ వారం సాధనచేసినవన్నీ పునశ్చరణ చేసుకోవాలి. పునశ్చరణ సులభంగా ఉండేందుకు ముఖ్యమైన పాయింట్లను, ఫార్ములాలను నోట్‌బుక్‌లో రాసుకోవాలి. 
  • ఒకే పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. కాబట్టి 45 రోజులు పట్టుదలతో కృషిచేస్తే మీ ప్రాంతంలోనే బ్యాంక్‌ ఉద్యోగం సాధించగలుగుతారు. 

ప్ర: ఒక జిల్లాకు చెందిన వ్యక్తి వేరే జిల్లాకు దరఖాస్తు చేయవచ్చా? 

జ: తెలంగాణలోని ఏ ఉమ్మడి జిల్లా అభ్యర్థి అయినా ఏ జిల్లాకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి చెందిన రిజర్వేషన్‌లు యథావిధిగా అమలవుతాయి. అయితే ఏదో ఒక జిల్లాకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.


నోటిఫికేషన్‌ వివరాలు

పోస్టులు: 225

నోటిఫికేషన్‌ విడుదలైన జిల్లాలు: హైదరాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్‌. 

విద్యార్హత : ఏదైనా డిగ్రీ 

వయసు: 1.10.2025 నాటికి 18-30 సంవత్సరాలు (జనరల్‌ అభ్యర్థులకు)

దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనికోద్యోగులకు) రూ.1000 (జనరల్‌/ బీసీ/ ఈడబ్ల్యూఎస్‌) జీఎస్టీ అదనం.

దరఖాస్తుకు చివరి తేదీ: 06.11.2025

పరీక్ష: డిసెంబరులో నిర్వహిస్తారు.

వెబ్‌సైట్‌: www.ibps.in (ఆయా జిల్లాల బ్యాంకుల వెబ్‌సైట్లు నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని