అభిరుచికి తగిన కోర్సు ఏది?

Eenadu icon
By Features Desk Published : 22 Jul 2025 00:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్‌ సెకండియర్‌ (ఎంపీసీ) చదువుతున్నాను. కొత్త ప్రాంతాలకు వెళ్లడమంటే చాలా ఇష్టం. నా ఆసక్తికి తగ్గట్టుగా డిగ్రీలో ఏ కోర్సు చేయొచ్చు?

అల్తాఫ్‌

మీకు కొత్త ప్రాంతాలకు వెళ్లడంపై ఆసక్తి ఉంటే ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ రంగంలో సర్టిఫికెట్‌/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ చేస్తే.. తగిన ఉపాధి అవకాశాలు ఉంటాయి.

టూరిజం, హాస్పిటాలిటీ రంగంలో ముఖ్యమైన కోర్సులు:

మూడేళ్ల వ్యవధి గల బీఏ / బీబీఏ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌: ఈ ప్రోగ్రాంలో టూరిజం నిర్వహణ, ప్రయాణ సంస్థల నిర్వహణ, టూరిజం మార్కెటింగ్‌ మొదలైనవి నేర్చుకోవచ్చు.

మూడేళ్ల వ్యవధి గల బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌: ఈ ప్రోగ్రాంలో హోటల్‌ నిర్వహణ, రెస్టారెంట్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్రొడక్షన్, ఫ్రంట్‌ ఆఫీస్‌ నిర్వహణ, గెస్ట్‌ సర్వీసెస్‌పై శిక్షణ ఇస్తారు.

మూడు/ నాలుగు సంవత్సరాల వ్యవధి గల బ్యాచిలర్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌: పూర్తి స్థాయి హోటల్‌ మేనేజ్‌మెంట్, టూరిజం, రెస్టారెంట్, రిసార్ట్, క్రూయిజ్‌ లైన్స్, ఎయిర్‌లైన్‌లలో అవకాశాలు.

ఒకటి/ రెండు సంవత్సరాల వ్యవధి గల డిప్లొమా ఇన్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌: టూరిజం రంగంలో మొదటి స్థాయి ఉద్యోగాలకు అనుకూలం.

ఏవియేషన్‌ అండ్‌ ఎయిర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంటుల్లో డిప్లొమా/ డిగ్రీ ప్రోగ్రాంలు: ఎయిర్‌లైన్‌ సర్వీసులు, గ్రౌండ్‌ సాఫ్ట్, క్యాబిన్‌ క్రూ, టికెట్‌ బుకింగ్‌ రంగాల్లో అవకాశాలుంటాయి.

మూడు/ నాలుగేళ్ల డిగ్రీ తరువాత ఆసక్తి ఉంటే, పీజీ కూడా చేయవచ్చు. రెండేళ్ల వ్యవధి గల ఎంబీఏ/ ఎంఏ టూరిజం మేనేజ్‌మెంట్‌ చదివి, టూరిజం రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలకూ, అధ్యాపక ఉద్యోగాలకూ ప్రయత్నం చేయవచ్చు.

టూరిజం, ట్రావెల్, హాస్పిటాలిటీ రంగాల్లో రాణించాలంటే.. కమ్యూనికేషన్, టీమ్‌ వర్కింగ్, ప్రాబ్లం సాల్వింగ్‌ స్కిల్స్‌ చాలా అవసరం. ఇంగ్లిష్, హిందీలతో పాటు ఏదైనా విదేశీ భాష కూడా నేర్చుకుంటే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇవే కాకుండా సేల్స్, మార్కెటింగ్, ఆర్కియాలజీ, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, ఫొటోగ్రఫీ రంగాల్లో కూడా నూతన ప్రదేశాలకు తరచుగా వెళ్లాల్సివుంటుంది. మీకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకొని, అందుకు సంబంధించిన సబ్జెక్టులతో డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు