తరాల ఘనతను చాటే కళారూపాలు!

పురాతన కాలం నుంచి కులవృత్తులు కొనసాగుతున్నాయి. వాటిలో కొన్ని ఉన్నతమైనవని, మరికొన్ని తక్కువస్థాయికి చెందినవనే అభిప్రాయం సమాజంలో నెలకొని ఉంది.

Published : 29 Apr 2024 00:18 IST

పురాతన కాలం నుంచి కులవృత్తులు కొనసాగుతున్నాయి. వాటిలో కొన్ని ఉన్నతమైనవని, మరికొన్ని తక్కువస్థాయికి చెందినవనే అభిప్రాయం సమాజంలో నెలకొని ఉంది. కానీ ఆత్మన్యూనత కలిగించే అలాంటి భావాలను తొలగిస్తూ ప్రతి కులానికి గొప్ప చరిత్ర ఉందని కొందరు కళాకారులు చెబుతున్నారు. మౌఖిక మాధ్యమాల ద్వారా ఆ విజ్ఞానాన్ని తరతరాలకు చేరవేస్తున్నారు. పురాణాలు, కథాగానాల రూపంలో ప్రదర్శనలు చేస్తూ కులాల పుట్టుపూర్వోత్తరాలను వివరిస్తున్నారు. ఒక వృత్తి అల్పమని, మరొకటి అధికమని అనుకోకూడదని, అన్నింటికీ సమాన గౌరవం ఉందని చాటుతున్నారు. ఈ విధంగా కులాల ప్రత్యేక సంస్కృతి, భారతీయ సంస్కృౖతిలో భాగమైన తీరును పోటీ పరీక్షార్థులు అర్థం చేసుకోవాలి. కుల పురాణాలను ప్రచారం చేస్తూ సామాజిక బాధ్యతలను నిర్వహిస్తున్న కులవృత్తి కళాకారులు, సంబంధిత వ్యవస్థల గురించి తెలుసుకోవాలి.

తెలంగాణలో కులవృత్తి కళాకారులు

తెలంగాణలో పలు కుల వృత్తి కళాకారులు వివిధ కులాలను యాచిస్తూ తమ కళారూపాలను ప్రదర్శిస్తూ జీవనం సాగించేవారు. ఇలాంటి కళాకారులు తమ సంప్రదాయాల పట్ల అత్యంత గౌరవంగా మెలిగేవారు.

పటంవారు: రజకులను యాచించే ఒక తెగ వాళ్లను పటంవారు అంటారు. వీరు పట ప్రదర్శక గాయకులు. వీరికి ‘పటం చాకళ్లు’, ‘ఆరోగ్య బ్రాహ్మణులు’ అని కూడా పేర్లున్నాయి. వీరు ముఖ్యంగా ‘రజక పురాణం’ గానం చేసి రజకులకు వినోదం కలిగిస్తారు. ఈ రజక పురాణాన్ని ‘బసవ విజయం’ అని కూడా పిలుస్తారు. ఇందులో రజక కుల పుట్టుకను వివరిస్తారు. ఇది రజకుల మూల పురుషుడైన మడివేలు మాచయ్య కథ. పాల్కురికి సోమనాథుడి బసవ పురాణంలో రజక కుల మడివేలు మాచయ్య కథ ఉంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన జానపద కథ గీతాల్లో కూడా రజక కుల మూల పురుషుడైన మాచయ్య కథ కనిపిస్తుంది. పటం చాకళ్లు రజక పురాణానికి సంబంధించిన పటాన్ని ప్రదర్శించి, కథను చెబుతారు. అందుకే వీరికి ‘పటంవారు’ అనే పేరు వచ్చింది. కథ ప్రారంభానికి ముందూ, కథ పూర్తయిన తర్వాత వీరు పటానికి పూజ చేసి కొబ్బరికాయ కొడతారు. పటంలో మడివేలు మాచయ్య జననం, రజక వృత్తి పరికరాలు, బిజ్జల రాజుతో మాచయ్య చేసిన యుద్ధం తదితర విషయాలు ముద్రితమై ఉంటాయి. వీరు ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, బేతుపల్లిలో, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని గణపురం, ములుగు, వర్ధన్నపేట, బొల్లికుంట, మానుకోట ప్రాంతాల్లో; ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి, మంథని; ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ, భువనగిరి ప్రాంతాల్లో కనిపిస్తారు.

గౌడ జెట్టీలు: గౌడ జెట్టీలు తెలంగాణలోని గౌడ కులానికి గాయకులు. వీరు కేవలం గౌడులను మాత్రమే యాచిస్తారు. వీరికి ‘జెట్టోళ్లు’, ‘శ్రేష్ఠులు’ అనే పేర్లు ఉన్నాయి. గౌడ జెట్టీలు ‘గౌడ పురాణం’ గానం చేస్తారు. ఇందులో గౌడ కుల పుట్టుక, అభివృద్ధిని వివరిస్తారు. ఈ కుల పురాణ గాథకు సంబంధించిన పటాన్ని ప్రదర్శిస్తారు. గౌడ పురాణంతోపాటు గౌడ జెట్టీలు కంటమ మహేశ్వరుని కథ, సురా భాండేశ్వర కథలను కూడా చెబుతారు. గౌడ జెట్టీల్లో రెండు రకాల కథాగాన పద్ధతులున్నాయి. ఒకటి పట ప్రదర్శన కళ, రెండోది భాగవత పద్ధతి. ఏ పద్ధతిలో కథాగానం చేయాలో తమ దాతృకులమైన గౌడులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వీరి బృందంలో అయిదుగురు సభ్యులుంటారు. ప్రధాన కథకుడు ఒక సన్నటి కర్రతో పటంలోని చిత్రాలను చూపిస్తూ కథ నడిపిస్తాడు. మిగిలిన వారు వంతలు. వీరు మద్దెల వాయిస్తూ సహాయం చేస్తారు. కథాగానం పూర్తయిన తర్వాత గౌడ జెట్టీలు బోనాల పండగ చేయిస్తారు. ఈ సందర్భంగా మేకపిల్లను బలి ఇస్తారు. బోనంలో వండిన నైవేద్యాన్ని    ఈ మేకపిల్ల రక్తంతో కలిపి గౌడ కులస్థుల ఇళ్లు, వారి వృత్తికి సంబంధించిన పరికరాలపై చల్లుతారు. ఈ విధంగా చేయడం వల్ల గౌడ కులం బాగుంటుందని వారి విశ్వాసం. ఈ ఉత్సవం తర్వాత గౌడ జెట్టీలు తమకు కావాల్సిన దానం తీసుకుని వెళతారు. వీరు కూడా సంచార జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వీరు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని గణపురం, ములుగు, వర్ధన్నపేట, తొర్రూరు, మహబూబాబాద్‌, జనగాం ప్రాంతాలు; ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అత్తుపురం, భువనగిరి ప్రాంతాల్లో కనిపిస్తారు.

డక్కలి వారు: డక్కలి వారు మాదిగ కులస్థులను మాత్రమే యాచిస్తూ ‘జాంబవ పురాణం’ అనే కథను గానం చేస్తారు. అందులో మాదిగ కుల పుట్టు పూర్వోత్తరాలను వివరిస్తారు. సంబంధిత పటాన్ని ప్రదర్శిస్తారు. మాదిగ కులస్థుల గోత్రాలను పఠిస్తారు. వీరి వద్ద జాంబవ పురాణానికి చెందిన తాళపత్ర గ్రంథాలుంటాయి. ఇంటి ముందు జాంబవ పురాణం గానం చేసే వీరిని మాదిగలు ముట్టుకోరు. వీరికి మిరాశీ గ్రామాలున్నట్లు థ్రస్టన్‌ వివరించారు. ఒకరి మిరాశీ గ్రామాలకు మరొకరు వెళ్లరు. ఒకవేళ వెళితే కుల తప్పు పెట్టి జరిమానా విధిస్తారు. వీరు ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ, మెదక్‌, నిజామాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో కనిపిస్తారు.

తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర

ప్రాచీన కాలంలో భారతదేశంలో ఎంతో విజ్ఞానం అభివృద్ధి చెందింది. అది చాలా కాలం వరకు ఒక తరం నుంచి మరొక తరానికి మౌఖిక మాధ్యమంలో అందింది. మన ప్రాచీనులు ఈ విజ్ఞానాన్ని భద్రపరచడానికి పలు విధానాలను అభివృద్ధి చేశారు. సమాజంలోని కింది, ఉన్నత వర్గాలు కూడా ఆ విజ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉండాలని భావించారు. ఉన్నత వర్గాల కోసం మార్గ పద్ధతిని, కింది వర్గాల కోసం దేశీ పద్ధతిని రూపొందించారు. మార్గ పద్ధతిలో సంస్కృత భాష, వ్యాకరణం, ఛందస్సు లాంటి వాటిని ఉపయోగించారు. దేశీ పద్ధతిలో స్థానిక భాషలు, శైలి, ప్రత్యేకతను ప్రదర్శించారు.

ఈ విధానాలు లోప రహితమై, జ్ఞానాన్ని ఒక క్రమ పద్ధతిలో అందించడానికి తోడ్పడ్డాయి. వ్యక్తుల సమష్టి జ్ఞానశక్తి నైపుణ్యంపై ఆధారపడి అభివృద్ధి చెందాయి. కాలక్రమంలో సమాజంలో సంక్లిష్టమై విజ్ఞానం విస్తరిస్తూ వచ్చింది. దాంతో సమాజంలోని కొన్ని కుటుంబాలపై విజ్ఞానంలోని కొన్ని భాగాలను భద్రపరిచి, వచ్చే తరాలకు అందించే బాధ్యత పడింది. ఈ కుటుంబాలు వారి కుల పుట్టుకను, గొప్పతనాన్ని కీర్తిస్తూ కుల పురాణాలను తయారు చేశారు. వాటిలో ఆ కులాల విశిష్టత, ఘనత, వాటి స్థాపకులుగా ఆది దంపతులైన శివపార్వతుల గురించి రాశారు. ఇవి కులాల మధ్య సమభావాన్ని ఏర్పరచడమే కాకుండా, ఆయా వ్యక్తుల్లో న్యూనతాభావాన్ని తొలగించడానికి ఉపయోడపడతాయి. ఒక కులవృత్తి అల్పమని, అధికమని కాకుండా సమాన గౌరవాన్ని పొందాయని పేర్కొంటాయి. ఆర్థిక, సామాజిక, మత వ్యవహారాల్లో తగిన గౌరవ స్థానం కలిగి ఉన్నాయని చెబుతాయి. ఈ సంచార జాతులు వివరించే కుల పురాణాల్లో రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి.  మొదటి భాగంలో కులాల పుట్టుక గురించి వివరిస్తూ, అవి సృష్టి ప్రారంభం నుంచి జరిగాయని చెబుతాయి. కొన్ని వృత్తులు సృష్టి ఆరంభంలో ఏర్పడగా, మరికొన్ని వృత్తులు కాలక్రమంగా అవసరాలను బట్టి రూపొందాయని వివరిస్తాయి. ఈ క్రమంలో ఆయా వృత్తుల స్థాపకుల పుట్టుక దైవాంశంతో కూడుకుని ఉందని చెబుతారు. మరికొంతమందిని అతి ప్రాచీన కాలం నాటి గొప్ప రుషుల వారసులుగా వివరించారు. ఫలితంగా వారు ఆయా వృత్తులను నిర్వహించడంలో గౌరవాన్ని పొందే అవకాశం కలిగింది. వారి వృత్తి పరికరాలు కూడా దైవాంశంతో కూడుకున్నాయనీ చెప్పారు. రెండో భాగంలో లౌకిక ప్రపంచంలోని వృత్తుల వారీ గొప్పతనాన్ని వివరించారు. వివిధ వృత్తుల వారు చేసిన యుద్ధాలు, సాధించిన విజయాలను వర్ణించారు. ఈ విధంగా ఆశ్రిత జాతులు ప్రధాన కులాలపై ఆధారపడుతూ, కుల పురాణాలను ప్రచారం చేస్తూ, సామాజిక బాధ్యతలను నిర్వహిస్తున్నాయి. ఈ కుల పురాణాల వల్ల కులాల ప్రత్యేక సంస్కృతి విశాల భారత సంస్కృతిలో భాగంగా కనిపిస్తుంది. ఆంగ్లేయుల పాలన వరకు ఈ ఆశ్రిత జాతులు, నాటి ప్రధాన కులాలపై ఆధారపడి ఒక సామాజిక ఐక్యతను పెంపొందించుకుని సహజీవనం చేశాయని చెప్పొచ్చు.

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని