శాస్త్రవేత్తలు - విశేషాలు

Eenadu icon
By Features Desk Published : 04 Nov 2025 00:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

శకుంతలా దేవి

ఈమె ప్రముఖ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త. క్లిష్టమైన గణిత గణనలకు అతివేగంగా సమాధానాలు చెప్పడంలో శకుంతల దిట్ట. ఈమె ప్రపంచవ్యాప్తంగా అనేక గణిత అవధానాలు నిర్వహించారు. కంప్యూటర్‌ కంటే ముందుగా అంకెలు గుణించి గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. ఆమెకు చదువు లేకున్నా.. తనకున్న అంకగణిత నైపుణ్యాలతో విద్యార్థులకు సంఖ్యా గణనలను సరళీకృతం చేయడానికి కృషిచేశారు. హ్యూమన్‌ కంప్యూటర్‌గా పేరొందిన శకుంతల నవంబరు 4న జన్మించారు. ఈ సందర్భంగా ఈమె జీవితంలోని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - ప్రదర్శనలు

శకుంతలా దేవి 1929, నవంబరు 4న బెంగళూరులో జన్మించారు. తండ్రి సి.వి.సుందరరాజ రావు సర్కస్‌లో పనిచేసేవారు. శకుంతలకు మూడేళ్లున్నప్పుడు పేక ముక్కల్లో ట్రిక్స్‌ నేర్పిస్తూ, ఆమె అసాధారణ రీతిలో సంఖ్యలను గుర్తుంచుకోవడాన్ని తండ్రి గమనించారు. అప్పటి నుంచి ఆయన సర్కస్‌ మానేసి ఆమెతో గణిత ప్రదర్శనలు ఇప్పించడం ప్రారంభించారు. 

  • అయిదేళ్ల వయసులో ఆమె క్యూబ్‌ మూలాలు లెక్కించడం లాంటి గణిత సమస్యలను పరిష్కరించారు. 
  • ఆరు సంవత్సరాలున్నప్పుడు శకుంతల యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌లో గణిత ప్రదర్శన ఇచ్చారు. కాలిక్యులేటర్లు, పెన్ను - పేపర్‌పై ఆధారపడకుండా సంక్లిష్టమైన గణిత సమస్యలను ఆమె పరిష్కరించారు. దీంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. సంప్రదాయ విద్యను అభ్యసించకుండానే చిన్నతనం నుంచే తన అంకగణిత ప్రతిభను దేశవిదేశాల్లో చాటారు.

రచనలు

1976లో ఆమె రచించిన ‘మోర్‌ పజిల్స్‌ టు పజిల్‌ యు’ అనే పుస్తకం విడుదలైంది. అదే ఏడాది ‘పర్ఫెక్ట్‌ మర్డర్‌’ అనే నవల రచించారు.

  • 1984లో ‘ఆస్ట్రాలజీ ఫర్‌ యు’ రాశారు. జ్యోతిషశాస్త్రంపై రాసిన పుస్తకం ఇది. 
  • 2006లో ‘ఇన్‌ ది వండర్‌లాండ్‌ ఆఫ్‌ నంబర్స్‌’ విడుదలైంది.
  • 2011లో ‘సూపర్‌ మెమొరీ: ఇట్‌కెన్‌ బీ యువర్స్‌’ అనే పుస్తకం రాశారు.

చివరిగా

గణితాన్ని మన దైనందిన జీవితంలోకి అనుసంధానించడం, గణితంపై ఆలోచనలను పెంపొందించడం లాంటి విషయాలపై ఆమె ప్రముఖంగా మాట్లాడారు. మ్యాథ్స్‌ అంటే చాలామందికి ఉండే భయాన్ని పోగొట్టేలా అనేక రచనలు చేశారు. ఈమె జ్యోతిష శాస్త్రంలోనూ ప్రావీణ్యం పొందారు. మనిషి పుట్టిన తేదీ ప్రకారం నక్షత్రాలు, గ్రహాల అధ్యయనం ద్వారా వ్యక్తిగత జీవితం గురించి అంచనా వేసేవారు. శకుంతల 2013 ఏప్రిల్‌ 21న బెంగళూరులో మరణించారు.

మానసిక గణనకు ఉపయోగించే పద్ధతులపై శకుంతలాదేవి రచించిన పుస్తకం, గతంలో అడిగిన ప్రశ్నలు - జవాబుల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని