ఏరోస్పేస్‌ ఇంజినీర్‌ కోర్సు ఎక్కడ?

ఇంటర్‌ (సీఈసీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో బీఎస్‌సీ ఏర్‌లైన్స్‌, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ కోర్సు చేయడానికి నాకు అర్హత ఉంటుందా? ఈ కోర్సు ఎక్కడ లభిస్తుంది?

Published : 08 Aug 2016 02:33 IST

ఏరోస్పేస్‌ ఇంజినీర్‌ కోర్సు ఎక్కడ?

* ఇంటర్‌ (సీఈసీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో బీఎస్‌సీ ఏర్‌లైన్స్‌, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ కోర్సు చేయడానికి నాకు అర్హత ఉంటుందా? ఈ కోర్సు ఎక్కడ లభిస్తుంది?

- కె. బాబు, మదనపల్లి

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదవడానికి ప్రభుత్వ గుర్తింపు ఉన్న కళాశాలలో 10+2 చదివి 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కాబట్టి బీఎస్‌సీ (ఏర్‌లైన్స్‌, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ) కోర్సు చదవడానికి మీకు అర్హత ఉంటుంది. కానీ భారతదేశంలో అతి తక్కువ విశ్వవిద్యాలయాల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. మనదేశంలో అతి తక్కువ ప్రైవేటు విద్యాసంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉస్మానియా లాంటి విశ్వవిద్యాలయాల్లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు అందుబాటులో ఉన్నప్పటికీ బీఎస్‌సీ- ఏర్‌లైన్స్‌, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ అందుబాటులో లేదు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రైవేటు కళాశాలలు మాత్రమే ఈ కోర్సును అందిస్తున్నాయి.


* మా అబ్బాయి బళ్లారిలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఏరోస్పేస్‌ ఇంజినీర్‌గా ఇస్రోలో చేరాలని తన ఆకాంక్ష. వివరాలు తెలుపగలరు.

- ఎస్‌.వి. గుప్తా, బళ్లారి

ఇస్రోలో ఏరోస్పేస్‌ ఇంజినీర్‌గా చేరాలనే మీ బాబు ఆకాంక్ష అభినందనీయం. ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ ఒక విభిన్నమైన కోర్సు. మనదేశంలో కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు/ విద్యాసంస్థల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ముఖ్యంగా దేశంలోని ఐఐటీలు- ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ ముంబయి, ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ కాన్పూర్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌- బెంగళూరు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ- తిరువనంతపురం, ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌- బెంగళూరు మొదలైన విద్యాసంస్థలు ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ కోర్సును అందిస్తున్నాయి.

మనదేశంలోని వివిధ విద్యాసంస్థలు ఒక్కో రకమైన ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థలు జేఈఈ ద్వారా, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ లాంటి విద్యాసంస్థలు ఐఎస్‌ఏటీ ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎంసెట్‌ ద్వారా ప్రవేశాలు లభిస్తాయి.


ప్రొ.బి.రాజ‌శేఖ‌ర్‌, కెరియ‌ర్ కౌన్సెల‌ర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని