logo

నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు

ఉమ్మడి జిల్లాలో లోక్‌సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు.

Updated : 27 Apr 2024 08:21 IST

ఉమ్మడి జిల్లాలో లోక్‌సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు. వరంగల్‌, మహబూబాబాద్‌తో పాటు భూపాలపల్లి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు కలిసి ఉన్న పెద్దపల్లిలోనూ రాజకీయ వారసులు ఎంపీ అభ్యర్థులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో ఇద్దరు రాజకీయాలకు కొత్త కాగా.. మరొకరు ఇప్పటికే ఎంపీగా కొనసాగుతున్నారు.    

నాడు తండ్రి.. నేడు కుమార్తె

రంగల్‌ నియోజకవర్గం  నుంచి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పోటీ చేస్తున్నారు. తండ్రి కడియం శ్రీహరి 2014-15 వరకు వరంగల్‌ ఎంపీగా పనిచేశారు. అనంతరం ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా రెండు సార్లు గెలుపొందారు. 2015-18 వరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇటీవల స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో 1994, 1999, 2008 ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.


రాజకీయ వారసురాలిగా..

హబూబాబాద్‌ ఎంపీగా 2019లో గెలుపొందిన మాలోత్‌ కవిత ప్రస్తుతం భారాస అభ్యర్థిగా బరిలో నిలిచారు. కవిత తండ్రి ధరంసోతు రెడ్యానాయక్‌ డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తండ్రి నుంచి రాజకీయ వారసత్వంగా కుమార్తె ఎన్నికల క్షేత్రం వైపు అడుగులు వేశారు. ఆమె గతంలో మహబూబాబాద్‌ ఎమ్మెల్యేగా సైతం పని చేశారు.  


కాకా చూపిన బాటలో..

పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ బరిలో నిలిచారు. వంశీ తండ్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి, తాత గడ్డం వెంకటస్వామి (కాకా) ఈ స్థానంలోనే పోటీ చేసి గెలుపొందారు. గడ్డం వివేక్‌ వెంకటస్వామి 2009-2014   వరకు పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం చెన్నూర్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో.. మంథని అసెంబ్లీ సెగ్మెంటులోని జయంశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం, మల్హర్‌, మహాముత్తారం, పలిమెల, మహదేవపూర్‌ మండలాలు ఉన్నాయి.

- న్యూస్‌టుడే, టేకుమట్ల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు