ఇదీ గుండెపోటే

అధిక కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు వంటి గుండెజబ్బు ముప్పు కారకాలేవీ ఉండవు. తినేదీ ఆరోగ్యకరమైన ఆహారం. క్రమం తప్పకుండా వ్యాయామమూ చేస్తుంటారు.

Updated : 23 Apr 2024 11:00 IST

అధిక కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు వంటి గుండెజబ్బు ముప్పు కారకాలేవీ ఉండవు. తినేదీ ఆరోగ్యకరమైన ఆహారం. క్రమం తప్పకుండా వ్యాయామమూ చేస్తుంటారు. చూడటానికి ఆరోగ్యంగా కనిపిస్తుంటారు. అయినా ఉన్నట్టుండి గుండెపోటుకు గురవుతుంటారు. అదీ చిన్న వయసులో. గుండెపోటులో ఇదొక రకం. దీన్నే స్పాంటేనియస్‌ కరోనరీ ఆర్టరీ డిసెక్షన్‌ (ఎస్‌సీఏడీ) అంటారు. యాబై ఏళ్లలోపు మహిళలకు దీని ముప్పు ఎక్కువ. సకాలంలో స్పందించి చికిత్స చేయకపోతే, ఇంత చిన్నవయసులో గుండెపోటు ఏంటని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లొచ్చు.

సాధారణంగా రక్తనాళాల్లో పూడికలతో గుండెపోటు వస్తుంటుంది. కానీ ఎస్‌సీఏడీ తీరే వేరు. దీనికి మూలం రక్తనాళాల మధ్య పొర చీలిక. దీంతో రక్తం గూడు కట్టి, నాళం గోడ పొరలు విడిపోతాయి. ఫలితంగా రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి గుండెపోటుకు దారితీస్తుంది. చాలావరకూ నెలసరి నిలవటానికి ముందు వయసులో.. 44 నుంచి 53 ఏళ్ల మధ్యలోనే ఇది తలెత్తుతుంది. ఇటీవల కాన్పు అయినవారిలోనూ 15 నుంచి 43 శాతం మంది దీని బారినపడుతుండటం గమనార్హం. ఎస్‌సీఏడీకి హార్మోన్లు, ఇవి అనుసంధాన కణజాలాల మీద చూపే ప్రభావం కారణం కావొచ్చని భావిస్తున్నారు. అప్పటికే ఎహ్‌లర్స్‌-డ్యాన్లోస్‌ సిండ్రోమ్‌ వంటి అనుసంధాన కణజాల సమస్యలు ఉండటం లేదా రక్తనాళ గోడల్లో కణాలు అసాధారణంగా వృద్ధి చెందటం వంటివీ దీనికి దారితీయొచ్చు. తీవ్ర భావోద్వేగాలకు లోనవటం, శారీరకంగా ఒత్తిడికి గురికావటమూ ఎస్‌సీఏడీకి దోహదం చేయొచ్చనీ అనుకుంటున్నారు. దీని బారినపడుతున్నవారిలో సుమారు 50% మంది తీవ్ర భావోద్వేగానికి గురవటం.. 20 నుంచి 30 శాతం మంది కఠినమైన వ్యాయామం చేసినవారు ఉంటుండటం కనిపిస్తోంది. అడ్రినలిన్‌ హార్మోన్‌ వంటి ఒత్తిడి కారకాలు సింపథెటిక్‌ నాడీ వ్యవస్థ, రక్తపోటు, గుండె వేగాన్ని చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అప్పటికే రక్తనాళం బలహీనంగా, తేలికగా చీలటానికి అనువుగా ఉన్నప్పుడు ఎస్‌సీఏడీ తలెత్తే అవకాశముంటుంది. దీని మీద సరైన అవగాహన లేకపోవటం, చాలాసార్లు ఆందోళనగా పొరపడటం మహిళలకు పెను సమస్యగా మారుతోంది. ఇలాంటివారిని ప్రాథమికంగా నిశితంగా గమనిస్తూ, అవసరమైతే మందులను ఇస్తారు. కఠినమైన పనులు చేయటం, బరువులు ఎత్తటమూ తగదు. దీంతో సమస్య మరింత తీవ్రంగా కాకుండా చూసుకోవచ్చు. కానీ తక్షణం ఇలాంటి చికిత్సలు, జాగ్రత్తలు తీసుకోవటం అరుదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని