నీట్‌ ఫలితం.. ఎంత అనుకూలం?

దేశవ్యాప్తంగా వైద్యవిద్యాకోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ‘నీట్‌’ ఫలితాలు వెల్లడయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులు తమకు సీట్లు వచ్చే అవకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. వారికి ఉపకరించే విశ్లేషణ ఇదిగో!

Published : 26 Jun 2017 01:59 IST

నీట్‌ ఫలితం.. ఎంత అనుకూలం? 

దేశవ్యాప్తంగా వైద్యవిద్యాకోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ‘నీట్‌’ ఫలితాలు వెల్లడయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులు తమకు సీట్లు వచ్చే అవకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. వారికి ఉపకరించే విశ్లేషణ ఇదిగో!

తొలిసారిగా తెలుగు విద్యార్థులు జాతీయ స్థాయిలోని నీట్‌ ద్వారా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలను పొందనున్నారు. ఈ ఫలితాలు వెలువరించినపుడు జాతీయస్థాయి ర్యాంకులనే ప్రకటించారు కానీ రాష్ట్ర స్థాయి ర్యాంకులను తెలియపరచలేదు. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు ఆధారంగానే ప్రవేశప్రక్రియ ఉంటుంది. కాబట్టి, ఫలితాలు వెలువడినప్పటికీ ఎక్కువ శాతం విద్యార్థులు అయోమయంలో ఉండిపోయారు.

2017లో నీట్‌-యూజీ పరీక్షకు దరఖాస్తు చేసిన విద్యార్థులు 11,38,890 మంది. వీరిలో పరీక్షకు హాజరైనవారు 10,90,085. ఈ పరీక్షలో కనీస అర్హత సాధించడమంటే ఓసీ విద్యార్థులకు 50 వ పర్సంటైల్‌, ఓబీసీ/ ఎస్‌సీ/ ఎస్‌టీ విద్యార్థులకు 40, ఓబీసీ/ ఎస్‌సీ/ ఎస్‌టీ వికలాంగ విద్యార్థులు 40 వ పర్సంటైల్‌, జనరల్‌ కేటగిరీ వికలాంగ విద్యార్థులకు 45వ పర్సంటైల్‌ మార్కును కటాఫ్‌ మార్కు. ఈ సంవత్సరం ఈ కటాఫ్‌ జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 131 మార్కులు, ఓబీసీ/ఎస్‌సీ/ఎస్‌టీ విద్యార్థులకు 107 మార్కులు, జనరల్‌- వికలాంగ విద్యార్థులకు 118గా ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ కటాఫ్‌ మార్కు తగ్గింది.

వీటి ఆధారంగా దేశంలోని 470 మెడికల్‌ కళాశాలల్లోని 65,170 సీట్లకు, 308 డెంటల్‌ కళాశాలల్లోని 25,730 సీట్లకు కలిపి అర్హత సాధించిన మొత్తం విద్యార్థులు 6,11,539 మంది. వీరిలో బాలురు 2,66,221, బాలికలు 3,45,313. విద్యార్థుల సంఖ్య పెరిగింది కాబట్టి, కటాఫ్‌ మార్కు తగ్గింది. ఈ విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల గరిష్ఠ మార్కు కూడా బాగా పెరిగింది. 720 మార్కులకు జరిగిన ఈ పరీక్షలో పంజాబ్‌కు చెందిన విద్యార్థి 697 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధిస్తే 695 మార్కులతో ఇద్దరు ఇండోర్‌, మధ్యప్రదేశ్‌ విద్యార్థులు 2, 3 ర్యాంకులు సాధించారు. మొదటి పది ర్యాంకులు 697 నుంచి 686 మార్కుల వరకు వచ్చాయి. తొలి పది ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులకు ర్యాంకులేమీ రాలేదు. తొలి 25 ర్యాంకుల్లో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు, ఒక ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి ఉన్నారు.

జాతీయస్థాయిలోని తొలి 1000 ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 130 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. తర్వాత ప్రతి 1000 జాతీయస్థాయి ర్యాంకుల్లో తెలుగు విద్యార్థుల సంఖ్య తగ్గి తొలి 5000లోపు ర్యాంకుల్లో 500లోపు మాత్రమే ఉంది. అలాగే తొలి 10000లోపు ర్యాంకుల్లో ఈ సంఖ్య ఇంకా బాగా తగ్గి 800లోపు మాత్రమే తెలుగు విద్యార్థులు ఉన్నారు. అంటే, జాతీయ స్థాయి ర్యాంకుకి 1/13 లేదా 1/14 వ వంతులో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయి ర్యాంకు ఉందని చెప్పవచ్చు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 9000 వరకు ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. జాతీయస్థాయిలో 20,000లోపు ర్యాంకు సాధించిన విద్యార్థి ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో సీటు సాధించే అవకాశం ఉంది. ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో కేటగిరీ-ఎ సీటుకి జాతీయ ర్యాంకు 40,000 నుంచి 45000లోపు వరకు సీటు సాధించే అవకాశం ఉంది. జాతీయస్థాయిలో 50,000 ర్యాంకు వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ కేటగిరీ-ఎ ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో సీటు పొందే అవకాశం కనిపిస్తోంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లోని కేటగిరీ-బి, సి సీట్లు కూడా నీట్‌ అర్హత పొందిన, ఫీజు కట్టగల విద్యార్థులతో మెరిట్‌ ప్రాతిపదికన భర్తీ అవుతాయి. నీట్‌లో 720 మార్కులకు 350కిపైగా వచ్చిన విద్యార్థులు సీట్లు పొందే అవకాశం ఉంది. కర్ణాటకలో తెలుగు రాష్ట్రాల మెడికల్‌ కళాశాలల్లోని బి, సి కేటగిరీ సీట్లు ఫీజులో సగమే ఉంది. దీంతో ఈసారి కర్ణాటకలోని ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 15, 16 లక్షల రూపాయిల వరకు సంవత్సరానికి ఫీజు కట్టగల విద్యార్థులు నీట్‌లో తక్కువ మార్కులు వచ్చినప్పటికీ సీట్లు పొందే వీలుంది.

కౌన్సెలింగ్‌ ప్రక్రియ జులై 3 నుంచి జరిగే అవకాశాలున్నాయి. విద్యార్థులు ముందుగా వారి ర్యాంకుకి సీటు సాధించగల కళాశాలలు ఏమున్నాయో అవగాహన ఏర్పరచుకుని వాటికి దరఖాస్తు చేసే ప్రక్రియ ప్రారంభించాలి. ప్రభుత్వ మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో లేదా ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో కేటగిరీ-ఎలో సీటు పొందే విద్యార్థులకు ఆరోగ్యవిశ్వవిద్యాలయాలు పేపర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాయిు. విద్యార్థులు ఆ ప్రకటన తర్వాత దరఖాస్తు చేసుకోవాలి.

కేటగిరీ-బి, సి సీట్లకు గతంలో కళాశాలపరంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. అదే ప్రక్రియ కొనసాగితే విద్యార్థులు ఏయే కళాశాలకు దరఖాస్తు చేయదలచుకున్నారో వాటికి విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. రాబోయే 20 రోజులు ప్రతిరోజూ వార్తాపత్రిక చూస్తూ వివిధ కళాశాలల ప్రకటన వచ్చిందీ, లేనిదీ గమనించాలి. లేదంటే ర్యాంకు సాధించినప్పటికీ కళాశాలలో చేరే అవకాశం లేకుండా పోతుంది.

తెలుగు రాష్ట్రాల్లో సీట్ల భర్తీ ప్రక్రియ జాతీయస్థాయి ర్యాంకు ఆధారంగానే ఉంటుంది. సీట్లు రాష్ట్ర విభజన పూర్వం ఏవిధంగా ఉండేవో అదేవిధంగా ఉండవచ్చని చెప్పవచ్చు. అంటే మొత్తం మూడు యూనివర్సిటీల పరిధి కింద అడ్మిషన్ల ప్రక్రియ ఏర్పడవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇక్కడి విద్యార్థులతో 85% సీట్లు, మిగిలిన రెండు యూనివర్సిటీలు- శ్రీ వెంకటేశ్వర, ఆంధ్రా విశ్వవిద్యాలయాల పరిధిలో విద్యార్థులతో 15% సీట్లు నింపాలి. అలాగే ఎస్‌వీలో అయితే ఆ ప్రాంత విద్యార్థులకు 85% సీట్లు, ఆంధ్రా, ఉస్మానియా యూనివర్సిటీ పరిధుల విద్యార్థులు 15% కేటాయించి సీట్లు నింపుతారు.

జాతీయ స్థాయిలో 20,000లోపు ర్యాంకు సాధించిన విద్యార్థి ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో సీటు సాధించే అవకాశం ఉంది. ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో కేటగిరీ-ఎ సీటుకి జాతీయ ర్యాంకు 40,000 నుంచి 45000లోపు వరకు సీటు అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని